గెలవలేకే రమేష్‌ యాదవ్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

గెలవలేకే రమేష్‌ యాదవ్‌పై దాడి

Aug 8 2025 7:03 AM | Updated on Aug 8 2025 7:03 AM

గెలవలేకే రమేష్‌ యాదవ్‌పై దాడి

గెలవలేకే రమేష్‌ యాదవ్‌పై దాడి

ఒంగోలు టౌన్‌: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో గెలుపుపై నమ్మకం లేకనే కూటమి పార్టీల పాలకులు, నాయకులు కలిసి వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందారెడ్డి విమర్శించారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్‌ సెంటర్లోని బీఆర్‌ అంబేడ్కర్‌, జ్యోతీరావుపూలే విగ్రహాలకు గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, పార్టీ నాయకుడు రామలింగారెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడి చేయడం అత్యంత హేయమైన చర్యని ఖండించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావలిని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసుల వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. కొండపి పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో పోటీ చేస్తున్న మేరీ అనే మహిళా అభ్యర్థిని కూడా ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌పై దాడి చేయడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావులేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మంచిదికాదన్నారు. ఇలాగైతే 2029లో రానున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలు బయట తిరగలేరని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నాయకుడు బొట్ల రామారావు, నగర ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ఖాన్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు...

వైఎస్సార్‌ సీపీ నాయకుల నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా నిరసన కార్యక్రమం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. తొలుత వన్‌టౌన్‌ సీఐ నాగరాజు పార్టీ నాయకులకు ఫోన్‌ చేశారు. ఇది మీ పరిధి కాదు కదా అని నాయకులు ప్రశ్నించిన వెంటనే టూటౌన్‌ సీఐ మేడా శ్రీనివాసరావు తెరమీదకు వచ్చారు. ఒకసారి పోలీసు స్టేషన్‌కు రావాలని బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావుకు ఫోన్‌ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఆయనతో సీఐ మాట్లాడుతూ.. అనుమతి లేకుండా నిరసన ప్రదర్శనలు చేయడానికి వీలులేదని హుకుం జారీ చేశారు. సమాచారం అందుకున్న చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఇతర నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల అనుమతి కోరుతూ లేఖ రాసిచ్చారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని చెప్పినప్పటికీ సీఐ వినలేదు. పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడి నుంచి వచ్చిన నాయకులు అంబేడ్కర్‌, పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ముగ్గురు ఎస్సైలు వచ్చి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని, విగ్రహాలకు పూలదండలు వేయకూడదని అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయంలో చేసుకోవాలంటూ ఎస్సై సందీప్‌ ఉచిత సలహా ఇచ్చారు. దాంతో బొట్ల రామారావుకు ఎస్సైకు మధ్య వాదన జరిగింది. అయినప్పటికీ పార్టీ నాయకులను బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేశారు. పోలీసుల ఓవరాక్షన్‌పై పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.

ఇలాగైతే రేపు మీ పార్టీ కార్యకర్తలు రోడ్లపై తిరగలేరు కూటమి పార్టీలకు వైఎస్సార్‌ సీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement