
రైతు గోడు పట్టని ప్రభుత్వం
ఒంగోలు సబర్బన్: పొగాకు రైతుల గోడును కనీసం విననైనా వినకుండా, కననైనా కనకుండా కళ్లులేని కబోదిలా టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ నాయకులతో కలిసి ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. స్థానిక త్రోవగుంటలోని వేలం కేంద్రంలో వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులు, పొగాకు బోర్డు అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న వేలం గురించి తెలుసుకున్న మేరుగు నాగార్జున.. పొగాకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. కూటమి ప్రభుత్వం పొగాకు రైతులను నిలువునా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పొగాకు వ్యాపార కంపెనీలతో ప్రభుత్వం చేతులు కలిపి మరీ పొగాకు రైతును నట్టేటముంచే పనిలో ఉందన్నారు. చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పొగాకు రైతు కుదేలవుతుంటే చూడలేక మరో దఫా వేలం తీరును పరిశీలించేందుకు తాము వచ్చామన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతుల బాధలను కళ్లారా చూసేందుకు పొదిలి వచ్చారన్నారు. పొగాకు రైతులు పడుతున్న కష్టనష్టాలపై కేంద్రానికి, రాష్ట్రానికి లేఖలు కూడా రాశారని గుర్తు చేశారు. అసలు రైతులను ఏం చేయాలనుకుంటున్నారు చంద్రబాబూ అంటూ మేరుగు నాగార్జున ప్రశ్నించారు. పొగాకు రైతును పాతాళానికి నెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా పొగాకు ధర రూ.28 వేలకు వెళ్తే.. చంద్రబాబు ప్రభుత్వంలో అదికాస్తా రూ.15 వేలకంటే కిందకు దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ బర్లీ పొగాకును రైతులందరి వద్ద కొనుగోలు చేయకుండా టీడీపీ నాయకులకు చెందిన పొగాకును మాత్రమే చీటీలు తీసుకుని మరీ కొనుగోలు చేయటం దుర్మార్గమైన చర్యని అన్నారు. కుదేలవుతున్న రైతులను చూస్తూ ఉండలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను తాను వేడుకుంటున్నానని, చంద్రబాబు వద్దకు వెళ్లి పొగాకు రైతులను ఏ విధంగా ఆదుకుంటారో అడగాలని సలహా ఇచ్చారు.
నాణ్యమైన పొగాకుకు కూడా రూ.280 దాటడం లేదు : చుండూరు రవిబాబు
నాణ్యమైన పొగాకును కూడా కేజీ రూ.280 దాటకుండా కొనుగోలు చేస్తున్నారంటే.. వ్యాపారులు, ప్రభుత్వం ఏ విధంగా లాలూచీపడ్డారో అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కమ్మకై ్క పొగాకు రైతును నిలువునా అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకుకు డిమాండ్ క్రియేట్ చేయటంలో పొగాకు బోర్డు తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు సిగ్గుపడాలన్నారు. కనీసం చంద్రబాబుతో మాట్లాడి రూ.200 కోట్లు తీసుకొచ్చి రిజెక్టు చేసి వెనక్కుపంపుతున్న పొగాకును కొనుగోలు చేయలేని ఎమ్మెల్యేలు ఎందుకున్నారంటూ ఆయన ప్రశ్నించారు. రైతుల్ని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకును వెనక్కుపంపే పనిలోనే వ్యాపారులు, బోర్డు ఉన్నాయన్నారు. ఇంత పండించండి అని ఆఽథరైజేషన్ ఇచ్చి మరీ కొనుగోలు వద్దకు వచ్చేసరికి ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో రూ.1.93 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు రూ.500 కోట్లు ఇచ్చి పొగాకు రైతును ఆదుకోలేడా అంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు బీఎస్‌ఆర్ మూర్తి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, నాయకులు కాట్రగడ్డ మహేష్ బాబు, పోలవరం శ్రీమన్నారాయణ, రైతులు పాల్గొన్నారు.
పొగాకు రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలం ఆత్మహత్యలు చేసుకునే స్థితికి రైతులను తీసుకెళ్తున్న పాలకులు ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రంలో వేలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున