
నకిలీ ఉత్తర్వులతో రూ.2 లక్షలకు టోకరా
● ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేసిన మహిళ
ఒంగోలు టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానంటూ నకిలీ ఉత్తర్వులు చూపించి ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి తన వద్ద 2 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని కందుకూరు టౌన్‌కు చెందిన ఓ మహిళ సోమవారం ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆమె ఎస్పీని కలిసి తన సమస్యను విన్నవించుకున్నారు. అదేవిధంగా ఏటీఎం వద్ద మోసానికి గురయ్యానని ఒంగోలు నగరంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం ఏటీఎంలో 50 వేల రూపాయల డబ్బు బదిలీ చేసేందుకు వెళ్లగా, ఏటీఎం పనిచేయకపోవడంతో ఏం చేయాలో తోచక నిలుచున్నానని, ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపిస్తానని నమ్మబాలికాడని తెలిపారు. అతడి చేతికి 50 వేలు ఇచ్చానని, డబ్బులు అకౌంటులో పడకపోవడంతో మోసం జరిగినట్లు గ్రహించానని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నాడు. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ.. వెంటనే ఆయా పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, డీటీసీ ఇన్‌స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, మీ కోసం ఎస్సై జనార్దన్ పాల్గొన్నారు.