
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగలా జరపాలి
ఒంగోలు సబర్బన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. సోమవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 15న 79వ స్వాతంత్య్ర దిన వేడుకలకు అతిథులకు ఆహ్వానం, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం, ప్రభుత్వ పథకాలు తెలియజేసేలా శకటాలు, ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు, ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటిని వీక్షించేందుకు విద్యార్థులను తరలించడంపై వంటివాటిపై సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఉదయం 8:30 గంటలకల్లా విద్యార్థులను పరేడ్ గ్రౌండ్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రోటోకాల్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి ప్రశంస పత్రాల కోసం ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. పీ – 4 పథకంలో మార్గదర్శకులను చురుకుగా గుర్తించిన వారిని, స్వతహాగా మార్గదర్శకులుగా మారిన అధికారులను ప్రశంస పత్రాలకు ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక కార్యక్రమాల ఏర్పాట్లపై దృష్టి సారించాలి
జిల్లా అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా వీడియో కాన్ఫరెన్స్