
ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దు
ఒంగోలు సబర్బన్: తమ ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఏఐటీఎఫ్‌యూ రాష్ట్ర నాయకుడు డీవీ స్వామి అన్నారు. ఈ మేరకు ఒంగోలు నగరంలోని సంతపేట వద్ద స్థానిక ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ ఒంగోలు నగర్ కార్యదర్శి టీ మహేష్ అధ్యక్షత వహించారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగ ప్రైవేటీకరణలో భాగంగా అదానీ కంపెనీకి స్మార్ట్ మీటర్ల బిగింపునకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. స్మార్ట్ మీటరు బిగింపు విద్యుత్ వినియోగదారులందరికీ ప్రమాదకరంగా తయారవుతుందన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపునకు అయ్యే ఖర్చు కూడా ప్రజల మీద మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచే పద్ధతిలో భారాలు వేయటం అత్యంత దారుణమన్నారు. బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించాలని, ఇంటికి బిగించే స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలని, విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ రైతు సంఘం సంయుక్త జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు ఎస్.కే మాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు ఎంఎస్ సాయిబాబా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి.కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు ఆర్.మోహన్, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఐద్వా, పెన్షనర్ల సంఘం, పట్టణ అభివృద్ధి కమిటీ నాయకులు పాల్గొన్నారు.
ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయాలి విద్యుత్ భవన్ వద్ద ధర్నాలో ఏఐటీఎఫ్‌యూ రాష్ట్ర నాయకుడు డీవీ స్వామి
నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు