
కుమారుడిపై తండ్రి దాడి
పెద్దదోర్నాల: కుమారుడిపై తండ్రి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని అయ్యన్నకుంటలో సోమవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో బయ్యన్న తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన కుడుముల వెంకటేశం భార్యపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న అతని కుమారుడు బయ్యన్న..తండ్రిని అడ్డుకోవడంతో గొడ్డలిలో దాడి చేయడంతో అతని తలపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బయ్యన్నను బంధువులు చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ దూరం
ఒంగోలు టౌన్: నిర్ణీత కాలం వరకు బిడ్డకు పాలివ్వడం ద్వారా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా తల్లులను కాపాడవచ్చని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జీజీహెచ్‌లోని గైనకాలజీ విభాగంలో తల్లులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్యరావు మాట్లాడుతూ...తల్లిపాలు తాగిన పిల్లలు బలంగా ఉంటారని, వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని, తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. సృష్టిలో తల్లిపాలకు మించింది లేదన్నారు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ సదస్సులో పాల్గొన్న మహిళలు ఇంటికి వెళ్లినప్పుడు తల్లిపాల ప్రాముఖ్యత గురించి చుట్టుపక్కల వారికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో గైనకాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ సంధ్యారాణి, పెడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ తిరుపతిరెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ మాధవీలత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆగి ఉన్న
లారీని ఢీకొట్టిన కారు
● మహిళ మృతి, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు
చౌటుప్పల్ రూరల్: రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ ని కారు ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామానికి చెందిన మద్దిరాల ప్రవీణ్‌కుమార్ బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ.. నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో నివాసం ఉండడానికి ఇల్లు చూసుకున్నాడు. తన తల్లి గోవిందమ్మ(62), భార్య సుమతితో కలిసి అద్దె ఇంట్లో దిగేందుకు స్వగ్రామం చిరుకూరుపాడు నుంచి సోమవారం రాత్రి 9గంటలకు కారులో హైదరాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో మంగళవారం తెల్లవారుజామున చౌటుప్పల్ దాటిన తర్వాత బొర్రోళ్లగూడెం గ్రామ స్టేజీ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. కారు ముందు సీట్లలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్, అతడి భార్య సుమతికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లులో కూర్చున్న ప్రవీణ్ తల్లి గోవిందమ్మకు ఛాతీ భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి మరిది మద్దిరాల నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. సీఐ మన్మథకుమార్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

కుమారుడిపై తండ్రి దాడి