
ప్రలోభాలు..బెదిరింపులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కొండపి గ్రామ పంచాయతీ ఎన్నిక కూటమి ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయట పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేవని నిరూపితమైంది. కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి టీడీపీ నాయకులు ప్రలోభానికి తెరలేపారు. మొదట వైఎస్సార్ సీపీతో 14 వార్డుల్లో 9 టీడీపీ, 5 వైఎస్సార్ సీపీకి, సర్పంచ్ టీడీపీ మద్దతు అభ్యర్థులకి కేటాయించేటట్లు ప్రలోభాలతో ప్రారంభించారు. ఈ ప్రతిపాదనను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తిరస్కరించి ఎన్నికల బరిలో సర్పంచ్ పదవికి, 14 వార్డు పదవులకు నామినేషన్ దాఖలు చేయించారు. మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు సమీపించడంతో టీడీపీ అధిష్టానం ఎలాగైనా ఏకగ్రీవంగా గెలవాలని ఇందుకోసం సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించింది. మొదట నాయకుల చేత రాజీ చర్చలు ఫలప్రదం కాకపోవటంతో దండోపాయాన్ని ఎంచుకుని తమ తొత్తులైన పోలీసులను రంగంలోకి దించింది. దీంతో వీరు మంగళవారం ఉదయం నుంచే వైఎస్సార్ సీపీ మద్దతుతో పోటీలో ఉన్న ముగ్గురు మహిళా అభ్యర్థులు యనమద్ని కళ్యాణి, అడ్డగబొట్టు విమలమ్మ, పల్లెమేరిలను టార్గెట్ చేసి తమ పథకాన్ని అమలు చేశారు. మొదట కళ్యాణి ఇంటికి భారీగా పోలీసులతో వెళ్లి ఆమెను ఒక సీఐ బెదిరించి విత్‌డ్రా చేయించారు. తరువాత పక్క జిల్లాకు చెందిన సీఐను రంగంలోకి దింపి పల్లె మేరిని ప్రలోభపెట్టే పనిచేశారు. చివరగా విమలమ్మ ఎలాగైనా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులకు దొరక్కుండా బస్సులో వెళుతుండగా టెక్నాలజీ సహాయంతో పసిగట్టి మరొక సీఐని రంగంలోకి దింపి అతని చేత వెళ్తున్న బస్సును ఆపి మరీ విమలమ్మను బెదిరించి ఆమె చేత బలవంతంగా వేలి ముద్రలు వేయించి నామినేషన్ విత్‌డ్రా చేయించారు. వాస్తవానికి 3 గంటలకల్లా నామినేషన్ విత్‌డ్రా కార్యక్రమం ముగించాల్సి ఉంది. కానీ ఎన్నికల అధికారి రవిబాబు ఆదేశాలతో మధ్యాహ్నం 3.15 గంటలకు గది తలుపులు మూశారు. దీంతో సర్పంచ్ ఎన్నికల జరుగుతుందని భావించారు. అయితే వైఎస్సార్ సీపీ అభ్యర్థులంతా విత్‌డ్రా చేసుకున్నారని, ఒక వేళ అభ్యర్థి విత్‌డ్రా చేయటానికి రాలేకపోతే ఆమె నామినేషన్‌కు ప్రపోజల్ పెట్టిన వారి చేత విత్‌డ్రా పత్రాలు సమర్పించవచ్చని ఆ ప్రకారం విత్‌డ్రా పత్రాలు ఎన్నికల అధికారి వద్దకు చేరాయని ఇక ఏకగ్రీవం అని ప్రకటించటమే తరువాయని టీడీపీ నాయకులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఆదిమూలపు సురేష్ ముందు జాగ్రత్త చర్యగా మేరి ఆరోగ్యంగా ఉందని, ఆమె అనారోగ్యంగా ఉండి రాలేని పరిస్థితిలో ఆమెకు ప్రపోజల్ సంతకం పెట్టిన వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో విత్‌డ్రా ఫారం అందజేసే అవకాశం ఉందని, దానిని ఆమోదించవద్దని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి కలిసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన సీఐ సోమశేఖర్ వెంటనే సురేష్ ఎన్నికల అధికారిని కలవాలంటే 5 గంటల తరువాతేనని చెప్పి అడ్డుకుని ఆయనను అక్కడి నుంచి పంపించేశారు.
వీళ్లకో న్యాయం..వాళ్లకో న్యాయమా..
మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగియగా 3.15 గంటలకు ఎన్నికల అధికారి తలుపులు మూసి ఇంకెవరు విత్‌డ్రా లు చేసుకోవటానికి లేదన్నారు. కానీ టీడీనీ నాయకులు తరువాత కూడా కార్యాలయంలోకి వెళ్లి వస్తున్నా వారిని ఎవరూ అడ్డుకోలేదు. 3.45 గంటలకు కార్యాలయానికి వచ్చిన సురేష్‌ను ఎన్నికల అధికారిని కలవకుండా అడ్డుకుని పంపించేశారు. తరువాత 4 గంటల సమయంలో ఉపాధి హామీ పథకానికి చెందిన సిబ్బంది విమలమ్మ చేత సీఐ బలవంతంగా వేలిముద్రలు వేయించిన కాగితాలను తీసుకొచ్చి ఎన్నికల అధికారికి అందజేసి చివరికి ఎన్నిక ఏకగ్రీవం అని ప్రకటించారు.
భారీ బందోబస్తు..
గ్రామ పంచాయతీ ఎన్నికల విత్‌డ్రా కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంపై కొండపి గ్రామ ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించగా ఒక సీఐ, ఐదుగురు ఎస్సైలు, దాదాపు 150 సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థులను బెదిరించి విత్‌డ్రా చేసే క్రమంలో ప్రజలు ఏమైనా తిరగబడతారేమోనన్న అనుమానంతో ఈ విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారా అని మండల ప్రజలు చర్చించుకున్నారు.
ఆద్యంతం బెదిరింపుల పర్వం
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి విత్‌డ్రా ప్రక్రియ ముగించే వరకు పోలీసులు బెదిరింపుల పర్వం సాగించారు. మొదట వార్డు సభ్యులను సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారి 8 మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల విత్‌డ్రాలను ఆమోదించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సురేష్ ఎన్నికల అధికారి రవిబాబును నిబంధనల ప్రకారం ఎలా విత్‌డ్రాలు చేస్తారని ప్రశ్నిస్తే సాయంత్రం 5 గంటల లోపే వారి చేత విత్‌డ్రా చేయించానని బుకాయించే ప్రయత్నం చేశారు. దీనిపై సురేష్ స్పందిస్తూ 5 గంటల సమయంలో వారు తన వద్దే ఉన్నారని అలాంటప్పుడు విత్‌డ్రా ఎలా చేస్తారని ప్రశ్నించటంతో నీళ్లు నమలటం రవిబాబు వంతయింది. దీనిపై డీజీపీ, గుంటూరు డీఐజీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, మానవ హక్కుల సంఘానికి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్‌కు వాట్సాప్ ద్వారా సురేష్ ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని కోర్టులను ఆశ్రయిస్తానని తెలిపారు.
వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి బందోబస్తు
వైఎస్సార్‌సీపీ నాయకులు అడక్కుండానే పార్టీ కార్యాలయం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను సాధారణ దుస్తుల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. తరువాత కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారి వద్ద ముగ్గురు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుల్స్ బందోబస్తు నిర్వహించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన వారు బయటకు వెళ్తుంటే రోడ్డు మొదట్లో ఎస్సై ప్రేమ్‌కుమార్ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అడ్డుకున్నారు. చివరికి ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కార్యాలయంలో విలేకరుల సమావేశానికి వస్తున్న విలేకరులను కూడా ఎస్సై స్థాయి అధికారి అడ్డుకునే ప్రయత్నం చేశారు. తరువాత కార్యాలయంలో విలేకరుల సమావేశం జరుగుతున్నంత సేపు డ్రోన్ కెమెరాతో వీడియో తీసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా వైఎస్సార్ సీపీ నాయకులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుని ఎట్టకేలకు సర్పంచ్ పదవిని టీడీపీకి అప్పగించారు.
పోలీసుల కనుసన్నల్లో కొండపి పంచాయతీ ఎన్నికలు ఓటమి భయంతో పోలీసులనే నమ్ముకున్న టీడీపీ అధిష్టానం ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమే అంటున్న ప్రజలు ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులతో ఏకగ్రీవం చేసుకున్న ప్రభుత్వం ముమ్మాటికీ అప్రజాస్వామిక గెలుపు అంటున్న వైఎస్సార్ సీపీ