ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

Aug 6 2025 11:56 AM | Updated on Aug 6 2025 11:56 AM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

విలేకరులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌

కొండపి: కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. దాదాపు 14 ఏళ్ల తరువాత జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించిన దళిత మహిళల ఆశలను పోలీసుల అండదండలతో అడియాశలు చేశారని, ఇందులో టీడీపీ నాయకులు ప్రధానపాత్ర పోషించారని ఆరోపించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ నాయకుల అరాచకాలను సురేష్‌ వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయి విత్‌డ్రా కార్యక్రమం ముగిసే వరకు కూటమి నాయకులు పోలీసుల సహకారంతో అనేక వికృత విన్యాసాలు చేశారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారని, దీంతో టీడీపీ నాయకులు పోలీసుల అండదండలతో అరాచకానికి తెరతీశారన్నారు. వైఎస్సార్‌ సీపీ మద్దతుతో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. చట్టాలను, ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా 5 రోజుల ముందే పోలీసుల బెదిరింపులతో ఎన్నికలు ముగించారన్నారు.

ముగ్గురు సీఐలతో బెదిరింపుల పర్వం:

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, టీడీపీ నాయకులు, అధికారులు సంయుక్తంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు మహిళా అభ్యర్థులపై బెదిరింపు రాజకీయాలకు దిగారని ఇందులో ముగ్గురు సీఐలు ప్రధానపాత్ర పోషించారని ఆరోపించారు. మా మద్దతు అభ్యర్థుల్లో ఒకరైన యనమద్ని కళ్యాణి ఇంటికి ఒక సీఐ వెళ్లి బెదిరించి మరీ విత్‌డ్రా ఫారాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. కళ్యాణి భర్త వసంతరావు ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, నీ భర్త ఉద్యోగం ఎలా చేస్తాడో చూస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపించారు. ఈ విషయమై కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌ యశ్వంత్‌కు సదరు సీఐపై ఫిర్యాదు చేస్తే ఆయన కొత్త కథ అల్లారని విమర్శించారు. అభ్యర్థి కళ్యాణి విత్‌డ్రా ఫారాలు తీసుకుని సీఐ వద్దకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చెప్పిందని కట్టుకథ అల్లారని విమర్శించారు. ఏ అభ్యర్థి అయినా ఎన్నికల్లో విత్‌డ్రా చేయాలంటే ఎన్నికల అధికారి వద్దకు వెళ్తారే తప్ప పోలీసుస్టేషన్‌కు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. మరో అభ్యర్థి పల్లెమేరి చేత విత్‌డ్రా చేయించే బాధ్యత మరో సీఐ పై టీడీపీ నాయకులు పెట్టారన్నారు. ఈమె సుమారు 200 కిలోమీటర్ల దూరంలో పూర్తి ఆరోగ్యంగా ఉంటే .. అనారోగ్యంగా ఉందని విత్‌డ్రా చేయటానికి రాలేదని చెప్పి ఈమెకు ప్రపోజల్‌ చేసిన వ్యక్తి చేత విత్‌డ్రా ఫారాలపై ఫోర్జరీ సంతకాలు చేసి ఇచ్చారన్నారు. ఈ ఫోర్జరీ బాగోతంపై తాను ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేద్దామని వెళితే సీఐ సోమశేఖర్‌ తనను కలవకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మరో అభ్యర్థి అడ్డబొట్టు విమలమ్మ టీడీపీ నాయకుల నుంచి భద్రత లేకపోవటంతో విత్‌డ్రా సమయం ముగిసే వరకు బస్సుల్లో తిరుగుతుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈమెను మద్దిపాడు వద్ద బస్సు ఆపి చదువురాని ఈమె చేత బలవంతంగా విత్‌డ్రా ఫారాలపై వేలిముద్రలు వేయించి సుమారు 4 గంటల సమయంలో ఆ విత్‌డ్రా ఫారాలను తీసుకొచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఒక ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగి చేత ఇప్పించారని ఆరోపించారు. ఈ విధంగా ఎన్నికల్లో పోలీసులు తమ పాత్ర పోషించి చివరికి ఎన్నికలు ఏకగ్రీవం అని ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసేది మహిళా అభ్యర్థులు:

కొంతమంది టీడీపీ నాయకులు సర్పంచ్‌ అభ్యర్థి విషయంపై అసభ్యకరంగా మాట్లాడారని.. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థి మహిళ అని గుర్తు చేశారు. మగతనం అంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకుని మహిళలను బెదిరించి అడ్డదారుల్లో గెలవటం కాదని, చేతనైతే దమ్ముంటే ప్రజాస్వామ్య యుతంగా స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి గెలవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

సమావేశంలో సురేష్‌ వెంట పార్టీ మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, ఢాకా పిచ్చిరెడ్డి, మారంరెడ్డి వెంకటాద్రిరెడ్డి, వసంత్‌రావు, దుద్దుగంట మల్లిఖార్జునరావు, బెజవాడ వెంకటేశ్వర్లు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, బొల్లినేని నాగేశ్వరరావు, పెట్లూరి కృష్ణమూర్తి,వి మల్లిఖార్జునరెడ్డి, షేక్‌ సల్తాన్‌, షేక్‌ కరీం, పాకనాటి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

పోలీసుల కనుసన్నల్లో కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికలు వైఎస్సార్‌ సీపీ మద్దతు అభ్యర్థులను సీఐలు బెదిరించారు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement