
నిమ్మతోటలను పరిశీలించిన ఉద్యానవన అధికారులు
పాతసింగరాయకొండలోని ఊరచెరువులో అక్రమంగా మట్టి తవ్విన ప్రదేశం
నేడు ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’
ఒంగోలు సిటీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని రామ్‌నగర్ 5వ లైన్‌లో గల ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ కార్యాలయంలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల రూపాయల బకాయిలు, 12వ పీఆర్సీ, ఐఆర్, పెండిండ్ డీఏలు, సరెండర్ లీవ్స్ బకాయిలు తదితర ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఒక వీడియో రూపంలో ముందుకు రానున్నట్లు తెలిపారు.
హనుమంతునిపాడు: మండలంలోని సీతారాంపురంలో నిమ్మ తోటలను ఉద్యానవనశాఖ అధికారులు సోమవారం పరిశీలించారు. నిమ్మ ధరలు భారీగా పడిపోవడంతో పాటు తోటలకు తెగుళ్ల ఆశించాయని రైతులు ఆందోళన చెందుతుండటంపై సాక్షి దినపత్రికలో ‘పాతాళంలోకి నిమ్మ ధరలు’ శీర్షికతో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన హార్టీకల్చర్ అధికారులు సీతారాంపురంలోని నిమ్మ తోటలను పరిశీలించి ఎండుపుల్ల, పులుసు పురుగు సమస్య ఎక్కువగా ఉందని గుర్తించారు. తెల్లపులుసు పురుగు, రసం పీల్చే పురుగు, కొమ్మ ఎండుతెగులు ఎక్కువగా ఉందని, వేరుకుళ్లు తెగులు కూడా ఉందని ఉద్యానవన శాఖాధికారిణి విష్ణుప్రియ తెలిపారు. తెగుళ్ల నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పిచికారీ చేయాల్సిన క్రిమిసంహారక మందులపై రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఎండుపుల్లలు వచ్చిన వెంటనే కత్తిరించాలని తెలిపారు. నిమ్మతోటటకు డ్రిప్ ద్వారా నీటిని అందించాలన్నారు. వేసవిలో నిమ్మ పండ్లు కోతకు వచ్చేలా బహార్ పద్ధతి పాటించడం వలన కాయకు మంచి గిరాకీ వస్తుందన్నారు. రైతు ఆదాయం పొందుతారన్నారు. ఆమె వెంట వీఏఏ భరత్, రైతులు ఉన్నారు.

నిమ్మతోటలను పరిశీలించిన ఉద్యానవన అధికారులు