
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మార్కాపురం టౌన్: భార్యపై కోపంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మార్కాపురం రూరల్ ఎస్సై అంకమరావు తెలిపారు. మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన చెన్నమ్మతో దొనకొండ మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన మనుమాల బ్రహ్మయ్య(40)కు వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నమ్మ తన పిల్లలను తీసుకుని రాయవరంలోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం బ్రహ్మయ్య అత్తగారి ఇంటికి వచ్చి భార్యను తనతో ఇంటికి రమ్మని పిలవగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుదాఘాతంతో ఒకరు మృతి
గిద్దలూరు రూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట రైల్వే స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. దిగువమెట్ట తండాకు చెందిన దేశావత్ పాపానాయక్(55) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వే స్టేషన్ వద్ద కాంట్రాక్టర్ నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులకు సోమవారం హాజరయ్యాడు. టిప్పర్ లారీలో ఇనుప సామగ్రిని అన్‌లోడ్ చేసేందుకు డ్రైవర్ ట్రాలీని పైకి లేపిన సమయంలో విద్యుత్ తీగలు తగిలాయి. అది గమనించని పాపానాయక్ టిప్పర్‌లోని సామగ్రి తీసేందుకు ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి చేరాడు. అక్కడే ఉన్న వ్యక్తులు పాపానాయక్‌ను కర్రలతో పక్కకు నెట్టి, చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మార్కాపురంలో భారీ చోరీ!
మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని బాబు కూల్ డ్రింక్స్ దుకాణంలో భారీ చోరీ చోటుచేసుకుంది. వివరాలు.. షాపు యజమాని షేక్ బాబు 4 రోజుల క్రితం మరో ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం రాత్రి బాబు ఇంటి వద్ద రంపం, ఇతర ఇనుప సామగ్రి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ యు.నాగరాజు, ఎస్సై సైదుబాబుతోపాటు క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఇంటి యజమాని అందుబాటులో లేరు. సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురై ఉంటాయని బంధువులు చెబుతున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి