
రైతుకు ఉరివేసి!
సాగును చిదిమేసి..
అన్నదాతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసింది. వర్షాలు లేక జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. భూమినే నమ్ముకున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు వేయాలంటే భయపడిపోయే పరిస్థితులున్నాయి. పొగాకు, మిర్చి, పత్తి, శనగ, మామిడి, నిమ్మ, వరి.. ఏ పంటలకూ గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా రైతు కుదేలైపోయాడు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగాన్ని గాలికొదిలేయడం, ఏడాది కాలంగా రైతుకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని ఎగ్గొట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. పెరిగిపోతున్న అప్పులను చూసి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఏడాది కాలంగా జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఆ కుటుంబాలకు చిల్లిగవ్వ కూడా విదల్చకపోగా, ఏవేవో కుంటిసాకులు చెబుతూ రైతు ఆత్మహత్యలను తప్పుదోవ పట్టించడం మరింత దారుణమని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అన్ని రకాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన రైతుకు అరకొరగా డబ్బులిచ్చేందుకు ముఖ్యమంత్రి ఆర్భాటం చేస్తున్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతన్న
● జిల్లాలో 17 మండలాల్లో తీవ్ర కరువు
● పట్టెడు అన్నం పెట్టే రైతన్నను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
● మిర్చి, పొగాకు, శనగ, పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధర రాక విలవిల
● ఆర్థికంగా కుదేలైన రైతు కుటుంబాలు
● ఏడాదిలోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య
● జిల్లాలో జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఆర్భాటం
● తొలి ఏడాది సాయం ఎగ్గొట్టి.. నేడు కోతలు పెట్టి
● నేడు అరకొర డబ్బులు ఇచ్చేందుకు దర్శి వస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో 2024–25 రబీ సీజన్‌లో సాధారణంగా 3,97,880 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. అయితే, కేవలం 2,99,331 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో కూడా దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో నిలువునా ఎండిపోయాయి. మిగతా 1.99 లక్షల ఎకరాల్లో కూడా సగానికిపైగా ఎకరాల్లో దిగుబడి మరీ దారుణంగా పడిపోయింది. దాదాపు జిల్లాలో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా, చివరకు దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కసారిగా చుట్టిముట్టిన ఆర్థిక సమస్యలతో కాలం వెళ్లదీయలేక ఇక లాభం లేదని నిస్సహాయతతో తనువు చాలిస్తున్నారు. సకాలంలో వర్షాలు పడక, ఒకవేళ అదును దాటి పంటలు సాగు చేస్తే పంట సక్రమంగా చేతికిరాక విలవిల్లాడిపోతున్నారు. దానికితోడు ప్రభుత్వం అందిస్తానన్న సాయం అందించకపోవటంతో ఆశగా ఎదురుచూసి చేసిన అప్పులు తీర్చలేక అశువులుబాస్తున్నా రు. జిల్లాలో రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరుకున్నారు. రైతు అప్పులు చేసి అవి తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే దానికి కూడా ఏవో కొన్ని సాకులు చూపించి రైతు కుటుంబానికి వచ్చే సాయం కూడా రాకుండా పంగనామం పెడుతున్నారు. ఆదరించాల్సిన ఇంటి పెద్ద లేకపోవటంతో ఆ కుటుంబాల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది.
మిర్చి రైతు కంట్లో కారం..
జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో రైతులు అత్యధికంగా మిర్చి సాగు చేస్తారు. వైఎస్సార్ సీపీ హయాంలో 96 వేల ఎకరాల్లో సాగు చేసిన రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గించేశారు. ఈసారి సుమారు 59,005 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. గతేడాది నవంబర్‌లో క్వింటా ధర రూ.17 వేల నుంచి రూ.18 వేలు ఉండగా, డిసెంబరు నాటికి రూ.14 వేలకు పడిపోయింది. జనవరిలో రూ.14 వేల నుంచి రూ.12 వేలకు చేరి మార్చిలో రూ.10 వేలు కనిష్టానికి పడిపోయింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డుకు వెళ్లడంతో ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టి సారించింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా మిర్చి ధర రూ.25 వేల నుంచి రూ.32 వేల మధ్య పలికింది. అలాంటిది ఈ ఏడాది రూ.11 వేలకు పడిపోవడం గమనార్హం. రైతులు రూ.లక్షల్లో నష్టపోయారు. రైతు కుటుంబాలు కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టబడ్డాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 4,62,944 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉంది. అలాంటిది ఇప్పటి వరకు కేవలం 25,725 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అంటే సాధారణ విస్తీర్ణంలో కేవలం నాలుగు శాతం మాత్రమే సాగులోకి వచ్చిందంటే జిల్లాలో రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ కుదింపే లక్ష్యంగా...
ఏడాది పాలన తరువాత చంద్రబాబుకు ఎన్నికల హామీ గుర్తుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎంతో మంది రైతుల ఉసురుపోసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలు కుమిలిపోతున్నాయి. అయినా అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ ఇస్తున్నాడా అంటే అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు పెట్టి జల్లెడపట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం గాలికి వదిలేసి ఎగ్గొట్టారు. చివరకు 2,68,165 మంది రైతులను అర్హులుగా తేల్చారు. పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్న ఆయన.. తాజాగా పీఎం కిసాన్‌తో కలిపి ఇస్తానని మాట మార్చారు. తొలి విడత రూ.7 వేలు ఇస్తానని చెప్పి, గత నెలలో వచ్చిన పీఎం కిసాన్‌తో కలిపి రూ.7 వేలు అని మాట మార్చారు. అయితే, మొదటి విడతలో చంద్రబాబు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది కేవలం రూ.5 వేలు మాత్రమే. జిల్లాలో రూ.134.08 కోట్లు ఇస్తున్నానని చెబుతున్నారు.అందులో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు దర్శికి రానున్నారు. అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022–23 సంవత్సరంలో రైతు భరోసా కింద 2,86,256 మందికి ఏడాదికి రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ అందజేశారు. రైతు భరోసా రూపంలో అందించింది ఐదేళ్లలో అక్షరాలా రూ.1,634.85 కోట్లు.

రైతుకు ఉరివేసి!