
కారుకు పోలీసు హారన్ బిగించి హల్‌చల్
మహిళల సమీపంలోకి కారు తీసుకెళ్లి టీజింగ్
స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు
ఒంగోలు టౌన్: కొత్తగా కొనుగోలు చేసిన కారుకు పోలీసు హారన్ బిగించిన ఓ ఆకతాయి ఒంగోలు నగరంలో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భయాందోళనలు సృష్టించాడు. ఒక మహిళ సమీపంలోకి కారు పోనిచ్చి భయపెట్టేందుకు ప్రయత్నించి దెబ్బలు తిన్నాడు.
పేర్నమిట్టకు చెందిన ఓ వ్యక్తి తన సోదరుడితో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తుంటాడు. ఇటీవలే కొత్తకారు కొని.. మూడు, నాలుగు రోజుల నుంచి పగలు రాత్రీ తేడాలేకుండా పోలీసు హారన్ మోగించుకుంటూ అతివేగంగా తిరుగుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం తాలుకా పోలీసు స్టేషన్ ఎదురుగా రోడ్డుపై కారు నిలబెట్టి హారన్ మోగిస్తూ రచ్చ చేశాడు.
శనివారం పేర్నమిట్టలోని ఒక హోటల్ యజమానిని భయపెటేందుకు యత్నించగా అతను.. సదరు కారు నడుపుతున్న వ్యక్తిపై పెట్రోలు చల్లినట్లు చెప్పుకుంటున్నారు. అనంతరం రోడ్డుపై వెళుతున్న ఒక మహిళకు అతి సమీపంలో కారు తీసుకెళ్లి ఆటపట్టించాడు. ఆగ్రహానికి గురైన సదరు మహిళ బంధువులు, స్థానికులు కలిసి ఆకతాయిని పట్టుకొని పేర్నమిట్ట బస్టాండులోని డివైడర్ వద్ద పోల్‌కు తాళ్లతో కట్టేసి చితకబాదారు. కాగా ఇతని వ్యవహారంపై పోలీసులు శుక్రవారం నుంచే గాలిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.