
పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడమే కారణం
ఆత్మహత్యగా చిత్రీకరణ
ఒంగోలులో దారుణం
ఒంగోలు టౌన్: క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు కుమార్తె గొంతు నులిమి చంపేయడం సంచలనం సృష్టించింది. ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముంగమూరు రోడ్డులోని విలేకరుల కాలనీ 1వ లైనులో నివశించే పల్నాటి రమేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కుమార్తె తనూష (23) డిగ్రీ చదివి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసింది. కొద్దిరోజులుగా ఒంగోలులోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనూష ప్రేమించింది.
ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనూషకు, తల్లిదండ్రులు రమేష్, లక్ష్మికి మధ్య మంగళవారం రాత్రి వివాదం జరిగింది. క్షణికావేశానికి గురైన రమేష్, లక్ష్మి తనూష గొంతును బలంగా నులిమారు. ఊపిరాడని తనూష ప్రాణం వదిలింది. కాసేపటికి తేరుకున్న రమేష్, లక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు.
రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని, కరెంటు లేకపోవడంతో సకాలంలో తాము గమనించలేదంటూ సీన్ క్రియేట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు తనూష మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. తల్లిదండ్రుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. సీఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.