
సాక్షి, విజయవాడ: ఎస్‌ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు బైఠాయించారు. టీడీపీ అరాచకాల ఆధారాలను వైఎస్సార్‌సీపీ నేతలు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు నినాదాలు చేశారు.
పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలు పెట్టింది. క్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్నారు. క్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు మోహరించారు. గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ నేతలు ఎవర్నీ గ్రామంలో రానివ్వడం లేదు.
కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారు. పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలు.. మీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోంది. దొంగ ఓటర్లతో పోలింగ్ బూత్‌ల నిండిపోయాయి.
