
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల అరాచకం, నిర్వీర్యమైన శాంతిభద్రతలు, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై విజయవాడలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్‌ను కలిశారు.
ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ గూండాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్‌సీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు వివరించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడి చేసి, ఎలా గాయపరిచారో తెలియచేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాజ్‌భవన్ వెలుపల బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...
కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి, ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారు.
కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరాం. ఎన్నికల కమిషన్‌కు కూడా దీనిపై ఫిర్యాదు చేశాం. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం.
ఆ విషయాన్ని కూడా గవర్నర్‌కు వివరించాం. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనంను ఆధారాలతో సహా గవర్నర్‌కు తెలియచేశాం. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడిన మాటలు పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్ని సందర్భాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వ్యవస్థలు చట్టప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదు.
గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నౌడు వెంకటరమణ తదితరులు ఉన్నారు.