సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.
‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్‌లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు
..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్‌మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్.
..బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్‌లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్‌మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్‌లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్‌లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్‌మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.


