‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’ | Ysrcp Bc Leaders Fire On Chandrababu Government | Sakshi
Sakshi News home page

‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’

May 27 2026 7:02 PM | Updated on May 27 2026 8:53 PM

Ysrcp Bc Leaders Fire On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్సార్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేశ్, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్‌ మండిపడ్డారు.

వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీల్ని బ్యాక్ బోన్ కులాలుగా నిలబెడితే, ఇప్పుడు కూటమి సర్కార్ మళ్లీ వారిని వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని, బీసీలకు చేసిన సంక్షేమంపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ నేతలు ఇంకేమన్నారంటే..

బీసీలకు డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేరా?: చెల్లుబోయిన వేణు
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ బీసీ ఉపముఖ్యమంత్రి ఉన్నారు, ఓసీల్లో కాపు సామాజిక వర్గానికి ఉపముఖ్యమంత్రి మీరే ఇచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే యోగ్యత లేదా ? బీసీలు ఏమీ అడగరనే ధైర్యమా ? బీసీల ఆత్మగౌరవ, ఆత్మక్షోభకు కారకులు మీరు కాదా ? ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసినా రాజ్యాధికారం పొందలేని స్ధితిలో ఉన్న అనేక కులాలు నాడు జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు. కానీ మీరు ఎన్నో అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కడా ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు ? వెనుకబడ్డ కులాల్ని ఇంకా వెనక్కు నెట్టేశారనడానికి ఇదే నిదర్శనం కాదా ?

ఆనాడు వైఎస్‌ జగన్‌ హయాంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పోరేషన్లు ఇస్తే .. మీరు ప్రతీ రోజూ ఏ కార్పోరేషన్ కూ భవనాలు లేవు, రూములు లేవని రోజూ విమర్శలు చేసారు. ఇప్పుడు మీరు 40 కార్పోరేషన్లను మాత్రమే వేసి మిగతా 16 కార్పోరేషన్లను వదిలేశారు.  బీసీలు చైత్యనం కావాల్సిన అవసరం ఉంది. అబద్దాలకు వేదికగా మహానాడు పెట్టి తన మోసాల్ని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. మోసపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక బీసీలను మోసం చేసిన పార్టీ టీడీపీ. అందుకే రాష్ట్రంలో బీసీ సమాజం చంద్రబాబు మోసంపై ఆగ్రహంగా ఉంది. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు బీసీల ద్రోహి. చంద్రబాబు అబద్దాల్ని నమ్మి బీసీలు రెండు, మూడు తరాలు వెనక్కిపోయారు.

బీసీ సంక్షేమంపై చర్చకు సిద్ధం: జోగి రమేష్‌
రెండు సంవత్సరాల చంద్రబాబు పాలనలో బలహీన వర్గాలకు అన్నీ ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్లే. వీటిపై మా పార్టీకి చెందిన బీసీ మాజీ మంత్రులంతా కలిసి ఓ కార్యాచరణ తీసుకోవాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మహానాడు వేదికగా చంద్రబాబు మాటమాటలు, లోకేష్ అబద్దాలు వింటుంటే రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు. 2019-2024 వరకూ వైఎస్‌ జగన్‌ పాలనలో వెనుకబడిన వర్గాలంతా ఎంతో ధైర్యంగా ఉన్నారు. స్పీకర్, కేబినెట్ మంత్రి పదవుల నుంచీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్ల నుంచీ, రాజ్యసభ సీట్ల వరకూ ఇచ్చి ఢిల్లీకి కూడా పంపారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో చోటిచ్చిన ఆ మహనీయుడి పరిపాలన ఎక్కడా ? అని వెనుకబడిన వర్గాలు ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు బలహీన వర్గాలు చెప్పిన 50 ఏళ్లు దాటితే ఇస్తానన్న పెన్షన్ ఏమైంది ? 45 ఏళ్లు దాటిన అక్కాచెల్లెళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ఇచ్చారు. కానీ ఇప్పుడు చంద్రబాబు మోసం చేసిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, చేయూత మోసాలు కనిపిస్తున్నాయి. జగనన్న పాలనలో బలహీన వర్గాలకు రూపాయి ఖర్చు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇచ్చి వాళ్ల ఆరోగ్యాల్ని కాపాడారు. అభివృద్ది, సంక్షేమంపై చర్చకు సిధ్దమంటున్న లోకేష్.. దానికి టైమ్, ప్లేస్ కూడా చెప్పాలని బీసీ మాజీ మంత్రులుగా అడుగుతున్నాం. బీసీ వర్గాలకు మా జగనన్న చేసిందేంటో, మీరు చేస్తోంది ఏంటో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాం.

బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు: విడదల రజని
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా జగనన్న.. ఐదేళ్ల పాలనలో బీసీల పట్ల తనకున్న ప్రేమను, బీసీల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఎలా అడుగులు వేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. దీని వల్ల బీసీలు ఎలా లబ్దిపొందారో కూడా చూసారు. కానీ అదే బీసీల్ని చంద్రబాబు ఇంకా వెనుకబాటుకు గురిచేస్తున్నారు. బీసీలకు ఏ విధమైన అభివృద్ది కానీ, సంక్షేమం కానీ ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ మహానాడులో బీసీలకు ఏదేదే చేసేశామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి బీసీల సంక్షేమం కోసం పాటుపడింది, వారికి న్యాయం చేసింది వైఎస్‌ జగనే.

మ్యానిఫెస్టోలో సైతం రాష్ట్రంలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అంతకు మించి ఖర్చుపెట్టిన చరిత్ర జగన్ ది. వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించారు. తన రెండో కేబినెట్ లో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశాలు ఇచ్చారు. కాంట్రాక్టుల్లో, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారు. మంగళగిరి, కుప్పం వంటి నియోజకవర్గాల్లో బీసీలకు ఇచ్చిన సీట్లే  జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సామాజిక న్యాయానికి నిదర్శనం. కానీ చంద్రబాబు ఎన్నికల్లో బీసీల్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం మినహా వారికి సరైన న్యాయం ఎప్పుడూ చేయలేదు. దీనికి వ్యతిరేకంగా బీసీ మాజీ మంత్రులు .. ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.

బీసీలపై తప్పుడు కేసులకు భయపడబోం: కారుమూరి నాగేశ్వరరావు
రెండేళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్ని గాలికొదిలేసి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ అన్యాయం చేసింది. ఆ రోజు 10 లక్షల కోట్లు అప్పులు చేశారని తప్పుడు విమర్శలు చేశారు. కానీ ఆయన చేసిన 3.30 లక్షల కోట్ల అప్పుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారో మీ నోటితోనే చెప్తున్నారు. ఇప్పుడు మీరు రెండేళ్లలోనే 3.50 లక్షల కోట్ల అప్పులు చేసినా వాటిని ఏం చేశారో చెప్పుకోలేని దుస్దితిలో ఉన్నారు. ఆనాడు వైఎస్‌ జగన్‌ నాకు మంత్రి, నా కొడుక్కి ఎంపీ సీటు కూడా ఇచ్చారు. 38 ఎమ్మెల్సీల్లో 18 ఎమ్మెల్సీల్ని, 9 మంది మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఛైర్మన్లలోనూ సింహభాగం బీసీలకు ఇచ్చారు.

రాష్ట్రంలో బీసీ బిడ్డలు బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చలవే. ఇప్పుడు ఎక్కడో యుద్దం జరుగుతుంటే పిల్లలకు డ్రెస్సు లేదు, బుక్స్ లేవంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు పత్రాల్లోనే మిగిలిపోయాయి. మీరు నా మీద, నా కొడుకు, కోడలి మీద కేసులు పెట్టినా భయపడేది లేదు. మేం తప్పుచేయలేదు కాబట్టి భయపడబోం, ప్రాణత్యాగానికైనా సిద్దం. బీసీ వర్గాల్ని ఇబ్బందిపెట్టాలని చూస్తే వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.

బీసీల్ని అన్ని విధాలా మోసం చేస్తున్నారు: బుట్టా రేణుక
బీసీలకు ఆర్దికంగా, సామాజికంగా అండగా నిలబడి, వారిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. బీసీ మహిళలకు  50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి,జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఏ పథకం కూడా ఇవ్వకుండా ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

ఈ రెండేళ్లలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా.. మా ప్రభుత్వంలో చేసిన దానికీ, మీరు చేసిన దానికీ తేడా ఏంటో చూపించే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ప్రతీ దాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో చంద్రబాబుకు తెలుసు. కానీ మేం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముందుకెళ్తాం. మేం ఎప్పుడూ సాధ్యమయ్యేదే చెప్తాం, దాన్నే అమలు చేసి చూపిస్తాం.

బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: కారుమూరి సునీల్
బీసీలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నారు. మహిళలకు ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తూ సూపర్ సిక్స్ ఇస్తామని, అన్నీ గాలికొదిలేశారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లేదు, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అమలు చేసిన ఏ ఒక్క పథకం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. డీఎస్సీలో చేసిన మోసంతో ఎంతో మంది బీసీ అభ్యర్ధులు ఇబ్బందిపడుతున్నారు. బీసీల్ని మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. త్వరలో ఈ దిశగా కార్యాచరణ రూపొందించి ఉద్యమం చేపట్టబోతున్నాం.

Advertisement
 
Advertisement
Advertisement