మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
డీఎస్సీ 2025 టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు..
లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారు
ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు
ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా?
అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి?
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరే..
ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరికే.. అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్ ప్రక్రియలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు
ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్ ర్యాంకర్..
మరి ఆ టాప్ ర్యాంకర్‌కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు?
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా?
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు?
టాప్ ర్యాంకర్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి డేటాను ఎందుకు మాయం చేశారు?
పేపర్ లీకేజీని దాచి పెట్టేందుకు ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు?
కలెక్టర్‌ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు?
అభ్యర్థుల మార్కులు, మెరిట్, కటాఫ్, సెలక్షన్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు?
1 : 1లో వెరిఫికేషన్‌కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’
డీఎస్సీలో జరిగిన స్కామ్‌కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా?
వీటన్నింటికీ సమాధానం కావాలంటే సీబీఐతో విచారణ జరగాలి
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్ బాధ్యతలను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.
కీలక బాధ్యతను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్‌మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.
గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్‌ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్‌లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్‌ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?
ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.
పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?
ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..
చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్‌లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి...!
– వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్‌గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్‌ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్‌మాల్‌తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్‌జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..
డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్‌కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్‌లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్‌లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్‌లు, అవకతవకలు చూస్తున్నాం.
పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!
కీలక బాధ్యతను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్‌మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్‌లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. 
అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..
పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.
స్కామ్‌ల కంపు కనిపించడం లేదా?
ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్‌ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్‌లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్‌ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఆన్‌లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్‌కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్‌లు పంపారు. 
ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?
ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్‌ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్‌లోకి వస్తారా? లేక రిజర్వేషన్‌లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్‌లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?
ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..
ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్‌లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్‌లోడ్ చేసే బాధ్యతలను అవుట్‌సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు.
ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు?


