చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Tweet On Chandrababu Negligence In Children Education | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్‌ జగన్‌

Nov 24 2024 1:13 PM | Updated on Nov 24 2024 4:10 PM

Ys Jagan Tweet On Chandrababu Negligence In Children Education

చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

విద్యార్థుల చదువులను దెబ్బతీస్తున్న చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు

మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు

విద్యార్థులపై చంద్రబాబు కక్ష

ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక..

ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం ఆవేదన కలిగించింది

చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే..

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు  చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు. ‘‘చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియాన్ని, 3వ తరగతి నుంచి టోఫెల్‌, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్‌, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.’’ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్‌ త్రైమాసికం వరకూ రూ.12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

 

‘‘ఎన్నికల కోడ్‌ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్‌ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్‌-జూన్‌, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్‌, బోర్డింగ్‌ ‌ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్‌ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి. కాళ్లేమో గడపకూడా దాటడం లేదు’’ అని దుయ్యబట్టారు.

‘‘ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.  చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి.

..ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్‌ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: అదిగో పులి... ఇదిగో తోక!

సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement