సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మోసం.. వైఎస్ జగన్ ఆగ్రహం | YS Jagan Slams Chandrababu Over Super Six Schemes | Sakshi
Sakshi News home page

ఫ్రీ బస్సు పేరిట ఘరానా మోసం.. చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Aug 28 2025 8:06 PM | Updated on Aug 28 2025 9:16 PM

YS Jagan Slams Chandrababu Over Super Six Schemes

సాక్షి,తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.  

‘చంద్రబాబు మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్నహామీని కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్‌-6, సూపర్‌ -7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్‌ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి, 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు.

ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఉంటే, అందులో 950 నాన్‌ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?

చంద్రబాబు ఇంతమోసం చేసికూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరికి వడ్డీసైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్లకాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు.  

మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని తొలిఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోతపెట్టారు.

మహిళల స్వయం సాధికార‌త కోసం, వారి కాళ్లమీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నావడ్డీ కింద మరో రూ.5వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.  మహిళల స్వయం ఉపాధికోసం చేయూత కింద ప్రతిఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750ల చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చి, అమూల్‌, పీ అండ్‌ జీ, హిందుస్థాన్‌లీవర్‌, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం. ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్‌ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికార‌తలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, మా చిత్త శుద్ధికి నిదర్శనం.

చంద్రబాబు మీరు… కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?

అంతేకాదు మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్‌. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్లకోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ!’ విమర్శలు గుప్పించారు వైఎస్‌ జగన్‌.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement