సీబీఐ దర్యాప్తు జరగాలి | YS Jagan Mohan Reddy comments on Sai Krishna death case | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తు జరగాలి

Jun 19 2026 4:34 AM | Updated on Jun 19 2026 4:35 AM

YS Jagan Mohan Reddy comments on Sai Krishna death case

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని ఓదారుస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

గిగ్‌ వర్కర్‌ సాయికృష్ణ లాకప్‌డెత్‌ ఘటనలో వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

ఈ కేసులో సీఐ ఒక్కడిని బాధ్యుడిగా చేస్తే సరిపోదు 

ఈ నేరంలో విజయవాడ సీపీ, డీజీపీకీ భాగముంది 

ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై మర్డర్‌ కేసు పెట్టాలి  

కొడుకు కోసం ఆ తల్లి పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరిగింది 

ఫొటోకు దండ వేసుకోమని సీఐ హేళన చేశారు 

ఆమె ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు చెత్తబుట్టలో పడేశారు 

సాయికృష్ణను చంపేశాక లీడర్ల ద్వారా తల్లితో బేరసారాలు 

తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో పోలీసుల్లో భయం 

బాధిత కుటుంబానికి అండగా వైఎస్సార్‌సీపీ 

చివరికి చంపామని ఒప్పుకుంటూ సీఐ సస్పెన్షన్‌   

మే నెలలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి 

కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని క్రాంతి కుమార్‌ అనే యువకుడు ఆత్మహత్య.. దోషులను ఎవరు కాపాడుతున్నారో 
తెలియాలంటే సీబీఐ విచారించాల్సిందే  

సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన గిగ్‌ వర్కర్‌ సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్‌తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్‌ చేశారని, విజయవాడ సీపీ, డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్‌ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రతి ఒక్కరూ ఆలోచించాలి
విజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్‌ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీ పరిధి. ఇదే పరిధిలోనే కృష్ణలంక పోలీసు స్టేషన్‌ ఉంది. ఇదే పోలీసు స్టేషన్‌ పరిధిలోనే ఈ తల్లి (జగన్‌ పక్కనే ఉన్న సాయికృష్ణ తల్లి) ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఒకటే ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంత మంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకు వస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ‘పోలీసులు చెబుతున్నట్లు నా కొడుకు దోపిడీలు, దొంగతనాలు చేసి కోట్లు గడిస్తే, ఒక గిగ్‌ వర్కర్‌గా ఎందుకు పని చేస్తాడు బాబూ..’ అని ఆ తల్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆ కుటుంబం పరిస్థితి అంత దారుణంగా ఉంది.

‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’ 
అన్న పోలీసులు ఆ రోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో..’ అంటూ ఈ తల్లిని సీఐ హేళనగా మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ఆ స్టేషన్‌లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆ తల్లికి అర్థమైంది. దీంతో ప్రతి రోజూ అదే పోలీసు స్టేషన్‌కు వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధ పడిన పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్‌ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్‌ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.

హైకోర్టును ఆశ్రయించాక ఒప్పుకున్నారు
తన కుమారుడికి ఏదో జరిగిందని ఆ తల్లికి అర్థమై.. తన కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని జూన్‌ 2న హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో పాటు, మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐపై చర్యలు తీసుకున్నారు. చంపేశాడనే కదా సీఐని సస్పెండ్‌ చేసింది! అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్‌ను కాపాడుతూ డీజీపీ.. ఇలా అందరికీ తెలిసి ఆ స్టేషన్లో జరిగింది ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ ఒకరి చావుకు కారణమైతే, ఇంకొకరు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను ఒకటే చెబుతున్నా. సస్పెన్షన్‌ అంటే ఏంటి? టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే.. గోళ్లు పీకి, చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్‌ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.

కృష్ణలంకలో జనానికి అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా..
ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే..ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్‌ను, డీజీపీని మర్డర్‌ కేసు పెట్టి ఛార్జ్‌ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్‌ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్బందీగా, కలిసికట్టుగా నేరం చేసి.. తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది? ఆ పిల్లాడి వయసు 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్‌ చేయమని సమన్‌ జారీ చేసింది. పోలీసులు చేయాల్సింది ఏంటి? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్‌మిట్‌ చేయాలి. ఆ పిల్లాడు తప్పు చేశాడా, లేదా అన్నది విచారణ చేసి కోర్టు నిర్ధారిస్తుంది. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు.

సీఐ మాత్రమే బాధ్యుడు కాదు
సీఐ, ఏసీపీ, కమిషనర్‌ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యలు చేపట్టి, కేవలం సస్పెన్షన్‌తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్‌ స్టాప్‌ పడుతుంది? ఫుల్‌ స్టాప్‌ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్‌ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీద యాక్షన్‌ తీసుకోవడంలో ఎందుకు డిలే జరిగింది? సస్పెన్షన్‌ మాత్రమే చేసి టెంపరరీగా సీఐని ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రైమ్‌లో సీఐ ఒక్కడే కాదు.. ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్‌ అయి ఉన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నాం. న్యాయ పోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సాసీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.

మే నెలలోనే రెండు ఘటనలు
మే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే, క్రాంతికుమార్‌ అనే మరో యువకుడిది ఆత్మహత్య ఘటన. పలానా పోలీసు స్టేషన్‌ పరిధిలో పలానా సీఐ రోజూ నన్ను కొడుతున్నాడు.. నేను తట్టుకో­లేక­పోతున్నాను.. నా చావుకు కారణం ఆ సీఐ.. అని మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసు­కున్నాడు. (కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని, తన చా­వుకు సీఐ కారణమని మరణ వాంగ్మూలం ఇస్తూ క్రాంతికుమార్‌ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను మీడియా ఎదుట జగన్‌ ప్రదర్శించారు).

సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే
మే 9వ తేదీ నుంచి రెండు మర్డర్‌ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్‌లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఏ విధంగా వీళ్లంతా నేరాన్ని బయటికి రాకుండా చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. 

కమిషనర్, డీజీపీ వంటి వంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్‌ అయ్యి.. నేరం చేయించారని కనిపిస్తున్నా, ఓ ఎస్పీ స్థాయి అధికారికి వీళ్లు దర్యాప్తు చేయడానికి బాధ్యత అప్పగించారట! అంటే వీళ్లు లా అండ్‌ ఆర్డర్‌తో, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం. అందుకే సీఐ మొదలు ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి కూడా ఎలా కాపాడుతున్నారు.. ఎందుకు ఇలాంటి లాకప్‌ డెత్‌లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ విచారించాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement