
పులివెందులలో టీడీపీ వేషాలు, అరాచకాలను ప్రజలు గమనించాలి
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రక్తపాతం సృష్టిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల్పుల రాముపై హత్యాయత్నం చేసి అతడితోపాటు మరో 50 మందిపై రివర్స్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారంటే పోలీసువ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్ అరాచకమేనని చెప్పారు.
పులివెందుల బ్రాండ్, ఖ్యాతిని మండల ప్రజలు నిలబెట్టాలని కోరారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వాస్తవాలను గ్రహించాలన్నారు. పదిరోజులుగా పులివెందులలో జరుగుతున్న సంఘటనలను పరిశీలించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం విచ్చలవిడిగా అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 5న ఇండిపెండెంట్ అభ్యర్థి సురేష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు అమరేశ్వరెడ్డిలతోపాటు 30 మందిపై రాడ్లు, రాళ్లతో దాడిచేశారన్నారు. మరుసటిరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాములపై హత్యాయత్నం చేశారని తెలిపారు. దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న కూటమి నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధనుంజయ అనే వ్యక్తిపై రాము, హేమాద్రి దాడిచేసి దుర్భాషలాడినట్లు కట్టుకథలు సృష్టించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 307 సెక్షన్ యాక్ట్ పెట్టారని చెప్పారు. పులివెందుల మండలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలందరిపై కేసులు నమోదు చేసి, పార్టీని బలహీనపర్చడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఊరి పక్కనే ఉన్న పోలింగ్ కేంద్రంలో కాకుండా నాలుగు కిలోమీటర్లు వెళ్లి నల్లపురెడ్డిపల్లెలో ఓట్లు వేయాల్సిన పరిస్థితి కల్పించారని నల్లగొండువారిపల్లి ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. టీడీపీ నాయకుల చర్యలతో పోలింగ్ శాతం తగ్గిపోయే అవకాశం ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీని గెలిపించాలి
ఈ ప్రాంతం ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోను, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోను అభివృద్ధి చెందిందని చెప్పారు. వైఎస్సార్ తెచ్చిన కృష్ణాజలాలను జగనన్న పొలాల్లోకి పారించారని తెలిపారు. ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని విమర్శించారు. గ్రామాల్లో అల్లర్లు, అలజడులు సృష్టించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారికి పోలీసులు సహకరిస్తున్నారని చెప్పారు.

టీడీపీ నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపులకు ఏమాత్రం బెదరకుండా వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేస్తున్నారని తెలిపారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అవసరమైతే మహిళలు ఏజెంట్లుగా కూర్చొని ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు టీడీపీ నాయకుల దాడులను సహించరని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.