అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్‌ గాంధీ | Why Punjab Police Stopped Rahul Gandhi To Visit Flood Hit Village Toor | Sakshi
Sakshi News home page

అదీ భారతదేశమే కదా.. నన్ను రక్షించలేరా?: రాహుల్‌ గాంధీ

Sep 16 2025 9:13 AM | Updated on Sep 16 2025 9:31 AM

Why Punjab Police Stopped Rahul Gandhi To Visit Flood Hit Village Toor

పంజాబ్‌ వరద ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌​ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భద్రతా కారణాలను చూపిస్తూ ఆయన్ని పలు గ్రామాల్లోకి పోలీసులు అనుమతించలేరు. దీంతో అధికారులను ఆయన నిలదీయగా.. మరోవైపు పంజాబ్‌ పోలీసులు, ఆప్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.

పంజాబ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి, ప్రజలకు అండగా నిలుస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. అయితే..

గురుదాస్‌పూర్‌ జిల్లాలో రావి నది వరదలతో దెబ్బ తిన్న టూర్‌ గ్రామంలోకి వెళ్లనీయకుండా పోలీసులు ఆ‍యన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులతో ఆయన సంభాషణ ఇలా సాగింది..

రాహుల్‌ గాంధీ: మీరు చెబుతున్నది ఏమిటంటే, భారత భూభాగంలో మీరు నన్ను రక్షించలేరు. అదేనా?

పోలీస్‌ అధికారి: మేము ఎప్పుడూ మీ రక్షణకు సిద్ధంగా ఉన్నాం

రాహుల్‌ గాంధీ: మీరు చెబుతున్నది ఇది భారతదేశమే (రవి నదికి అటుపక్కనున్న గ్రామాన్ని చూపిస్తూ), కానీ మీరు నన్ను అక్కడ రక్షించలేరు. అది భారతదేశం కాదా?.. ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లలేరు అంటే, పంజాబ్ పోలీస్ రక్షించలేరు అని అర్థమా?

పోలీస్‌ అధికారి: అది భారత్‌ భూభాగమే అయినా, ప్రస్తుతం అక్కడ రక్షణ కల్పించడం కష్టం

అయినప్పటికీ రాహుల్‌ గాంధీ బోటు ద్వారా ఆ గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వరద ప్రవాహం ఎక్కువగా ఉందని అధికారులు వారించడంతో ఆయన మరోసారి వాళ్లను నిలదీశారు.

నది ప్రశాంతంగానే ఉంది. ఇది నిజమైన కారణం కాదు అంటూ టూర్‌ గ్రామానికి వెళ్లకుండా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలు ఘోనేవాల్ (అమృత్‌సర్) మరియు గుర్చక్ (గుర్‌దాస్‌పూర్) గ్రామాల్లో పర్యటించారు. ఇక ఈ ఘటనపై పంజాబ్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.  భారతదేశంలోనే మనం సురక్షితంగా లేకపోతే.. మరెక్కడ సురక్షితంగా ఉంటాం? అని ప్రశ్నిస్తోంది.

మాజీ సీఎం చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ స్పందిస్తూ.. అక్కడ మన ప్రజలే(భారతీయులే) ఉన్నారు. రాహుల్‌ గాంధీ వాళ్ల పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. మూడు రోజులుగా కాంగ్రెస్‌ తరఫున అక్కడ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. అలాంటిది ప్రజల్ని కలవనివ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ.. భారతదేశంలో రాహుల్ గాంధీకి పాకిస్తాన్ నుంచి ప్రమాదం ఉందని చెబుతున్నారు. రాహుల్ గాంధీని రవి నదికి అటుపక్కనున్న గ్రామానికి వెళ్లనివ్వకుండా భద్రతా కారణాలు చూపడం సరైంది కాదు. ఇది భారతదేశమే, అక్కడ మన ప్రజలే ఉన్నారు. ఆయన వారి సమస్యలు తెలుసుకోవాలనుకున్నారు అని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత పార్థాప్ సింగ్ బాజ్వా ఈ పరిణామంపై కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘అధికారులు చెబుతున్నట్లు అది భద్రతా సమస్య కానేకాదు. ఇది రాజకీయ నిర్ణయం. బాధ్యత తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరాధార భద్రతా కారణాలు చూపుతోంది. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని ఆయన అన్నారు.

పంజాబ్‌ పోలీసులు ఏం చెబుతున్నారంటే..
రాహుల్ గాంధీ పర్యటించాల్సిన టూర్ గ్రామం భారత్‌లోనే ఉంది. పంజాబ్‌ గుర్‌దాస్‌పూర్ జిల్లా రావి నది ఒడ్డున ఉంది. అయితే, ఆ ప్రాంతం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఇటీవల వరదలతో బార్డర్ ఫెన్సింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి నిఘా పటిష్టం చేశారు. అందుకే పంజాబ్ పోలీస్, బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ రాహుల్ గాంధీకి అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. రాహుల్‌కే కాదు.. మరేయితర పార్టీ నేతలకూ అక్కడికి వెళ్లేందుకు ప్రస్తుతానికి అనుమతి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement