Munugode: బీజేపీ ఓటమి.. కమ్యూనిస్టులకు సంతోషమెందుకు?

Why Communist Parties Happy With TRS Victory In Munugode - Sakshi

మునుగోడు విజయం ఎవరికి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోంది? బీజేపీని ఓడించినందుకు గులాబీ పార్టీ కంటే ఎర్ర పార్టీలే ఎక్కువ సంబరాలు చేసుకుంటున్నది నిజమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక క్రమంగా ఉనికి కోల్పోతున్న వామపక్షాలకు మునుగోడు టానిక్‌లా పనిచేస్తుందా? టీఆర్ఎస్‌తో మునుగోడు పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందా? 

మునుగోడు ఒకప్పుడు సీపీఐకి కంచుకోట
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వామపక్షాలు తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్నాయి. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేక, స్థానిక సంస్థల్లో కూడా కూనారిల్లిపోతూ... కేడర్‌ చెల్లాచెదురవుతున్నా.. చేసేది లేక చేష్టలుడిగి చూస్తున్నారు అగ్ర నాయకులు. లెఫ్ట్ పార్టీల విజయం అనే మాట విని చాలాకాలం అయిపోయింది. మునుగోడు అసెంబ్లీ స్థానం ఒకప్పుడు సీపీఐకి కంచుకోట. అటువంటి చోట ఎన్నోసార్లు గెలిచిన కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోగా... గతంలో విజయం సాధించిన సీపీఐ సోదరపార్టీ సీపీఎంతో కలిసి ఇప్పుడు టీఆర్ఎస్‌కు మద్దతివ్వాల్సి వచ్చింది. ఓడిన బీజేపీ రెండో స్థానానికి చేరింది. అయినప్పటికీ బీజేపీ ఓటమిలో తమ ప్రమేయం ఉండటం సీపీఐ, సీపీఎంలకు ఎంతో సంతోషాన్నివ్వడమే గాదు..వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చినట్లయింది.

కారెక్కడమే కామ్రెడ్‌లకు బెటరా?
మునుగోడులో ఎలాగైతే టీఆర్ఎస్‌తో కలిసి బీజేపీని ఓడించగలిగామో... భవిష్యత్‌లో కూడా తెలంగాణ రాష్ట్రంలో తమ సైద్ధాంతిక శత్రువైన కమలం పార్టీకి అధికారం దక్కకుండా గులాబీ పార్టీతో కలిసి సాగాలని వామపక్షాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సూది, దబ్బనం పార్టీలు అన్న నోటితోనే... ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో లెఫ్ట్ పార్టీల వల్లే గెలిచాం అని చెప్పడంతో ఎర్ర పార్టీల నేతలు ఉబ్బి తబ్బిబ్బు అయిపోతున్నారట. ఏడాదిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు తమకు బలమున్న స్థానాల్లో చెరో పది అడగాలని చర్చించుకుంటున్నట్లు సమాచారం. అదేవిధంగా చెరో ఎంపీ సీటు కూడా అడిగే ఆలోచన చేస్తున్నాయట. ఇక ఎన్నికలు వచ్చే వరకు టిఆర్ఎస్ తో ఉమ్మడి కార్యాచరణకు కూడా సిద్ధం అవుతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. 

ఇక్కడ బూస్ట్‌.. అక్కడ సపోర్ట్‌
బీజేపీపై ఉమ్మడిగా చేసే పోరాటానికి తెలంగాణలో ప్రధాని పర్యటనను అస్త్రంగా మలచుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కార్యాచరణలో ఇరుపక్షాలకు ప్రయోజనాలు దాగున్నాయి. లెఫ్ట్ పార్టీలకు తెలంగాణలో బూస్టింగ్ ఇచ్చి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కోసం  సీపీఎం, సీపీఐల మద్దతు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని లెఫ్ట్ పార్టీలు టిఆర్ఎస్ సహాకారంతో ఎలాగైనా అడుగు పెట్టాలని చూస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో కూటమి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి సక్సెస్ కాదని కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వం గట్టిగా అభిప్రాయపడుతోంది.

కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు లేనేలేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన పాదయాత్ర సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య స్నేహం కుదిరే చాన్స్ లేదు. వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో దోస్తీ కొనసాగిస్తున్నాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్‌ను కాదని టీఆర్ఎస్‌తో పొత్తు కొనసాగించగలుగుతారా? మునుగోడు బాటలో నడిచి తెలంగాణ అసెంబ్లీలో మళ్ళీ పాదం మోపాలని రాష్ట్రంలోని రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. ఈ పూర్వ రంగంలో లెఫ్ట్, టీఆర్ఎస్ పార్టీలు కలిసి ముందడుగు వేస్తాయా? లేదా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top