
పార్టీ పెట్టి 15 ఏళ్లయింది. ఇన్నేళ్లుగా సొంతంగా పోటీ చేయడం అనేది లేకపోయింది. చంద్రబాబు పొత్తుతోనో బిజెపి అండతోను ఎన్నాళ్ళని నడుస్తాం.. వాళ్లని గెలిపించడానికి పడుతున్న కష్టం ఏదో మనంతట మనం గెలవడానికి నిలవడానికి పడితే ప్రయోజనం ఉంటుంది కదా.
మన పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు కూడా ఆసరా ఇచ్చినట్లు ఉంటుంది కదా.. ఊత కర్ర వదిలేద్దాం సొంతంగా నడుద్దాం అనే ఆలోచనలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారా.. తాను మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో చెప్పినప్పటికీ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చ నేపథ్యంలో ఇలా ఉంటే కుదరదని.. చంద్రబాబు తనను నిమ్మరసం పిండినట్లు పిండేసి తొక్కలు బయటకు విసిరేసినట్లుగా తనను బయట వదిలేస్తాడని జ్ఞానబోధ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తానే బలపడేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నారు వచ్చే ఎన్నికల నాటికి. ఇలా గుప్పెడు సీట్లు తీసుకుంటే కుదరదని.. మూడెంతల సీట్లు డిమాండ్ చేసే పరిస్థితికి ఎదగాలని పవన్ కళ్యాణ్ కు పార్టీ సీనియర్లు కాపు నేతలు సైతం హిత బోధ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీరు పట్ల కాపు నేతల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. క్యాడర్లో కూడా తాము ఎంతసేపు తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగడమేనా ప్రభుత్వాన్ని నిలబెట్టింది
మేము తీసుకొచ్చింది మేము అయినప్పటికీ మాకు ఎంగిలి మెతుకులే తప్ప ప్రధాన పదవులు కానీ ఇతరత్రా అధికారాల్లో కానీ వాటా లేదన్న మనోవేదన కనిపిస్తోంది. దీంతోపాటు తెలుగుదేశం నాయకుల చేతిలో జనసైనికులు పలు సందర్భాల్లో అవమానాలకు గురైన సంఘటనలు సైతం ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఉన్న బలాన్నీ బేరిజు వేసుకోడానికి అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 60 నియోజక వర్గాల్లో ఇప్పటికే సర్వే పూర్తికాగా వాటిలో దాదాపుగా 50 నియోజకవర్గాల్లో తమకు బలం పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా ఒక అంచనాకు వచ్చారు.
వాస్తవానికి పార్టీకి ఎంతవరకు రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గ ఇన్చార్జిలతో కథ నడిపిస్తూ వస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి పార్టీని తీసుకువెళ్లాలంటే జిల్లా కమిటీలు ఏర్పాటు చేయక తప్పదు. ఆ తరువాత గ్రామ బూత్ కమిటీ వేయాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా రాత్రి కి రాత్రి ఎన్నికల్లో గెలిచేయడం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ కు రాజకీయ సలహాదారులు చెప్పినట్లుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఇకపై పార్టీని గాలికి వదిలేయకుండా 65 నియోజకవర్గాల్లో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో కనీసం 50 ఎమ్మెల్యే టికెట్లు డిమాండ్ చేసే పరిస్థితికి ఎదగాలని సేనాని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జిల్లా అధ్యక్షులు నియమకాలు కూడా చేపడతారని పార్టీ సమాచారం.
ఎంతసేపు చంద్రబాబు చేయి పట్టుకొని ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లడం పార్టీకి మంచిది కాదని.. ఇలా చేయడం ద్వారా మున్ముందు పార్టీ ఒక పరాన్న జీవి మాదిరిగా మిగిలిపోతుంది అన్న భయాన్ని పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్‌లోకలిగించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మున్ముందు సొంతంగా ఎదిగి మరింత బలోపేతం అయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా చేతిలో ఉన్న సినిమాలను త్వరగా పూర్తిచేసి పార్టీ నిర్మాణాన్ని చేపట్టాలని పవన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎత్తులకు చంద్రబాబు ఏ విధమైన పైఎత్తులు వేస్తారో.. జనసేన ఎదుగుదలను చంద్రబాబు తన కుయుక్తులతో ఏ విధంగా నియంత్రిస్తారో చూడాలి
సిమ్మాదిరప్పన్న