
సాక్షి, తాడేపల్లి: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎపిసోడ్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించారు. అలాగే, పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చింది అని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నీతులు చెప్పడమే కాదు ఆచరించాలి. సిద్ధాంతాలు, భావజాలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఒక వ్యూహం ప్రకారమే బోండా ఉమా అసెంబ్లీలో మాట్లాడారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం ఎందుకు ప్రశ్నించారు. ఎందుకు అంత ఘాటుగా మాట్లాడారు. బోండా మాటల వెనుక ఎవరు ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి కంపు కొడుతోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకుని చేసిన వసూళ్లన్నీ ఒకే పార్టీకి దక్కాయి. అందుకే పొల్యూషన్ బోర్డు గురించి తెరపైకి తెచ్చారని చర్చ నడుస్తోంది.
హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ సాక్షిగా ఏం జరిగింది. హైదరాబాద్‌లో ఆస్తులు సమకూర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. బోండా-పవన్ మధ్య నడిచిన మాటల యుద్ధం అంతా అవినీతి వ్యవహారానికి సంబంధించినదే. పంపకాల్లో తేడా రావడం వల్లే అవినీతి వ్యవహారం బయటికి వచ్చింది. అందుకే చంద్రబాబు ఈ విషయాన్ని తొక్కిపెట్టారు. పొల్యూషన్‌ను కంట్రోల్ చేయాల్సిన బోర్డు అవినీతికి పాల్పడటమేంటి?. కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతోందని టీడీపీ నేతలే చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో నీతి వ్యాఖ్యలు చెబుతూ అవినీతికి పాల్పడటమేంటి?.
పవన్ చెబితేనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ మాట వింటారని బోండా చెబుతున్నారు. పవన్.. కృష్ణయ్యకు ఏం చెప్పారో.. ఏం దిశానిర్ధేశం చేశారో సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా వాస్తవాలు వెల్లడించాలి. బోండా ఉమా ప్రశ్నలకు పవన్‌కు అంత కోపం రావడానికి కారణమేంటి?. ఈ విషయంపై ప్రజలు లోతుగా ఆలోచించాలి. కృష్ణయ్య పెద్ద పెద్ద కంపెనీలను బెదిరిస్తున్నారు. తునిలో దక్కన్ కెమికల్స్.. లార్స్ ల్యాబ్‌తో పాటు మరికొన్నింటిని టార్గెట్ చేశారు. పవన్, కృష్ణయ్య దెబ్బకు పెద్ద కంపెనీలన్నీ రాష్ట్రాన్ని వదిలిపోతున్నాయి. కృష్ణయ్య రాత్రి పూట తనతో సెటిల్ చేసుకోకపోతే తనిఖీలు చేయిస్తారు. ఫార్మా వేస్టేజ్‌ను సిమెంట్ కంపెనీలకు అమ్మి ప్రతీ రోజూ 30 లక్షలు సంపాదించాలనేది కృష్ణయ్య లక్ష్యం.

ప్రీ ప్రోసెసింగ్ యూనిట్లకు కృష్ణయ్య వల్ల చాలా నష్టం. రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల జీఎస్టీ నష్టం. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలి. బోండా వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపరు?. నిబంధనలన్నీ పాటిస్తే కంపెనీలు ఉండవని పవన్ చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిబంధనలు పాటించారని పవన్ ఒప్పుకున్నారు. ప్రజల జీవితాలకంటే పరిశ్రమలు మీకు ఎక్కువా?. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.
100 కోట్లు దోచుకోవడానికే విజయవాడ ఉత్సవ్. అందరూ విజయవాడ ఉత్సవ్ లో పాల్గొనాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. మీరు ప్రజలకు ఏం చేశారని ఉత్సవాల్లో పాల్గొనాలి. బుడమేరు వరదలో మునిగిపోయినందుకు పాల్గొనాలా?. ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో చేరినందుకా?. ఈరోజు వరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనలేదు. విజయవాడ ఉత్సవ్ మీద టీడీపీ ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా ఉన్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది అని అన్నారు.