బెంగాల్‌లో మళ‍్లీ అదే రిపీట్‌ అవుద్ది: మోదీ | West Bengal walking on path of change shown by Medinipur, Nandigram: PM Modi | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో మళ‍్లీ అదే రిపీట్‌ అవుద్ది: మోదీ

Apr 9 2026 1:47 PM | Updated on Apr 9 2026 2:03 PM

West Bengal walking on path of change shown by Medinipur, Nandigram: PM Modi

హాల్దియా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్‌లో మార్పుల రాబోతుందని చెప్పారు. మోదీ గురువారం పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈ సారి భవానీపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

"రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను ఓడించాలని బెంగాల్‌ ప్రజలు నిర్ణయించారు. అని నేను చూశాను. ఈ ఉత్సాహం, ఉత్తేజంలోనే బీజేపీ విజయం కనిపిస్తోంది. ఇది మార్పును తీసుకువచ్చే తుపాను. ఇది టీఎంసీ సర్కారుకు వీడ్కోలు. ఐదు సంవత్సరాల క్రితం మేదినిపూర్, నందిగ్రామ్ మార్పునకు మార్గాన్ని చూపాయి. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ అదే దారిలో నడవడం ప్రారంభించింది.

ఇతర రాష్ట్రాలు ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాయి. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించింది. బెంగాల్‌లో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. బెంగాల్‌ను అభివృద్ధి వైపుగా తీసుకెళ్లడానికి పునాదిని శక్తిమంతంగా వేసే ఎన్నికలు ఇవి. టీఎంసీ సర్కారును గద్దె దించడం అవసరం. ఇప్పుడు భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశంలో వృద్ధి వేగవంతంగా ఉందంటే  అనేక రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. కానీ దేశం ముందుకు వెళ్తుండగా, టీఎంసీ సర్కార్ బెంగాల్‌ను వెనక్కి నెడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు.

చొరబాటుదారుల పరిశ్రమలు పెరిగాయి.. 
ఒకప్పుడు భారత పురోగతికి పునాది వేసిన తయారీ, వాణిజ్యాన్ని బలపరిచిన బెంగాల్‌ను టీఎంసీ అన్ని అభివృద్ధి సూచికల్లో దిగజార్చిందని మోదీ చెప్పారు. ‘ఈ పరిస్థితి మేదినిపూర్, హాల్దియా ప్రజల కంటే ఎవరికి బాగా ఎవరు తెలుసు? శతాబ్దాల క్రితమే చారిత్రక తమ్రలిప్త (Tamralipta Kingdom)తో వాణిజ్యం జరిగిన పోర్ట్ నగరం. హాల్దియా ఆధునిక భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. 

కానీ ఇటీవల దశాబ్దాల్లో హాల్దియాలో కర్మాగారాలు మూతపడ్డాయి. ఒకప్పుడు దేశం నలుమూలల నుంచి ప్రజలు హాల్దియాకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి యువత ఉద్యోగాల కోసం అండమాన్, ఒడిశాకు వలస వెళ్తున్నారు. టీఎంసీ సర్కార్‌లో చొరబాటుదారుల పరిశ్రమలు మాత్రమే పెరిగాయి. నకిలీ పత్రాలు తయారు చేయడం, పశువుల అక్రమ రవాణా వంటి రంగాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement