ఇదీ టీడీపీ నేతల చిల్లర వ్యవహారం | AP CMRF Scam: TDP Leaders Chillara Dramas | Sakshi
Sakshi News home page

ఇదీ టీడీపీ నేతల చిల్లర వ్యవహారం

Apr 9 2026 1:57 PM | Updated on Apr 9 2026 4:18 PM

AP CMRF Scam: TDP Leaders Chillara Dramas

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ కుంభకోణంలో తెలుగు దేశం నేతలు కొత్త నాటకానికి తెర తీశారు. బాధితుడు ఎల్లయ్య కుటుంబ సభ్యుడొకరు తమకు బాకీ ఉన్నాడని.. ఆ అప్పు కిందే అతని ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి రూ. 8 లక్షలు తీసుకున్నామని ఇప్పుడు కవరింగ్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

రాజంపేట కుందా నెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్‌లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. 

ఇంటికొచ్చాక ఫోన్‌ చూసి ఎల్లయ్యకు మతిపోయే విషయం చెప్పారు కుటుంబ సభ్యులు. ఎల్లయ్య అకౌంట్‌కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ అకౌంట్‌కేనని తెలిసింది. దీంతో ఎల్లయ్య టీడీపీ నేతలను నిలదీశాడు. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. 

ఫేక్‌ ప్రామిసరీ నోట్‌తో?
విషయం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన కొందరు నేతలే ఈ స్కాంను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్రమార్కులు కొత్త డ్రామాకు దిగారు. బాధితుడు ఎల్లయ్యకు బావమరిది అయిన శశికుమార్‌కు అప్పు ఇచ్చామని, ఆ సొమ్మునే వడ్డీతో సహా తాము తీసుకున్నామని చెబుతూ ఓ ప్రామిసరీ నోటును చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బాధితుడితోనే బలవంతంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని.. తన బావమరిది నిజంగానే అప్పు తీసుకున్నాడంటూ చెప్పించే ప్రయత్నం చేశారు.   అయితే.. శశికుమార్‌ వివరణతో టీడీపీ నేతల చిల్లర వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి అప్పు చేయలేదని.. పైగా ఆ ప్రామిసరీ నోట్‌లో సంతకం తెలుగులో ఉందని.. తాను ఇంగ్లీష్‌లో సంతకం చేస్తానని.. ఆ నోట్‌ ఫేక్‌ అని శశికుమార్‌ వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశాడు.  దీంతో తెలుగు తమ్ముళ్లు తప్పు మీద తప్పు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

సంతకం ఫోర్జరీ, CMRFలో 8 లక్షలు కొట్టేసిన TDP నేత

చంద్రబాబుకు సీపీఐ లేఖ
రాజంపేటలో వెలుగు చూసిన కుంభకోణం నేపథ్యంలో.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అక్రమాల సంగతి తేల్చాలంటూ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఓ లేఖ రాశారు. టీడీపీ నేతలకు సీఎం సహాయక నిధి ఒక ఆదాయ వనరుగా మారిందన్నారు తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ‘‘మీ పార్టీలో ఒక టీం ఇదే పనిగా పెట్టుకుంది. అధికారులు కూడా వీళ్లకు సహకరిస్తున్నారు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాల్లో తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధులతో జేబులు నింపుకుంటున్నారు.  ఆర్థిక సహాయం ఎంత అందినా.. రూ.6 లక్షలే ఇస్తామని టీడీపీ నేతలు చెబుతుండడం దోపిడీకి పరాకాష్ట. తమకు ఖర్చులు ఉంటాయని.. అందరికీ పర్సంటేజ్‌లు ఇవ్వాలని బహిరంగంగా చెప్పుకుంటున్నారు.  ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్న మీ పార్టీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’’ అని చంద్రబాబును ఈశ్వరయ్య లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement