అస్సాం, కేరళలో నేడే పోలింగ్‌ | ECI Set To Assam, Kerala and Puducherry gear up for elections 2026 | Sakshi
Sakshi News home page

అస్సాం, కేరళలో నేడే పోలింగ్‌

Apr 9 2026 6:14 AM | Updated on Apr 9 2026 6:22 AM

ECI Set To Assam, Kerala and Puducherry gear up for elections 2026

పుదుచ్చేరిలో కూడా 

అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ఈసీ 

మే 4న కౌంటింగ్, ఫలితాల వెల్లడి

అస్సాం, కేరళల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ గురువారం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా వాటితో పాటే జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కేరళ, పుదుచ్చేరిల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్‌ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది. మూడు చోట్లా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.

కేరళలో కూటముల పోరు
కేరళలో సీపీఎం సారథ్యంలోని పాలక ఎల్డీఎఫ్‌ కూటమి హ్యాట్రిక్‌పై కన్నేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. రాష్ట్రంలో ఒక పార్టీ, లేదా కూటమి వరుసగా రెండోసారి నెగ్గడం అదే తొలిసారి. ఎల్డీఎఫ్‌ ఆశలకు గండికొట్టి ఈ సారి ఎలాగైనా విజయం సా ధించాలని కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్‌ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన కేరళలో ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాల్లో ముక్కోణపు పోరు నెలకొంది.

ప్రచార హోరు
మూడు కూటములూ నెల రోజులకు పైగా హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గురువారం జరిగే పోలింగ్‌లో 2.71 కోట్ల మంది ఓటర్లు వాటి భాగ్యరేఖలను తేల్చనున్నారు. ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్టార్‌ ప్రచారకులుగా నిలిచారు. యూడీఎఫ్‌ తరఫున కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎల్డీఎఫ్‌ కూటమికి మాత్రం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అంతా తానై ప్రచార ప్రక్రియను ముందుండి నడిపించారు. సుపరిపాలన, అభివృద్ధి ఈసారి కూడా తమను ఒడ్డుకు చేరుస్తాయని ఎల్డీఎఫ్‌ ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఆ కూటమిని భయపెడు తున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై తమ విజయం ఖాయమని యూడీఎఫ్‌ విశ్వసిస్తోంది. సీపీఎం, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ తాము చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని ఆ కూటమి భావిస్తోంది. కొన్నేళ్లుగా కేరళలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ, ఈసారి దాన్ని ఎలాగైనా సీట్ల రూపంలోకి మార్చాలని పట్టుదలగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కలిసొస్తుందని నమ్ముతోంది.
    – తిరువనంతపురం

అస్సాంలో హోరాహోరీ
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ కూటములు హోరాహోరి తలపడ్డాయి. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్‌ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, ఆ పార్టీ ఆశలకు గండి కొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ ఈసారి సర్వశక్తులూ ఒడ్డింది. రెండు పార్టీలూ ఎప్పట్లాగే పలు ప్రాంతీయ పక్షాలతో జట్టు కట్టి బరిలోకి దిగాయి. 

హిమంత దూకుడు: బీజేపీ తరఫున మోదీ, అమిత్‌ షా రెండేసిసార్లు ప్రచారంలో పాల్గొన్నా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, దూకుడైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌ కూడా ఎక్కువగా పీసీసీ చీఫ్‌ గౌరవ్‌ గొగొయ్‌పైనే ఆధారపడింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా 99 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. దాని భాగస్వాముల్లో రైజోర్‌ దళ్‌ 13, ఏజేపీ 10, సీపీఎం 3, ఏపీహెచ్‌ఎల్‌సీ 2 చోట్ల పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. 

భాగస్వాములు ఏజీపీ 26, బీపీఎఫ్‌ 11 చోట్ల బరిలో దిగాయి. పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు ఇరు కూటములకూ తలనొప్పిగా మారాయి. 9 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటం విశేషం! రాష్ట్రవ్యాప్తంగా 59 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. జాలూక్‌బారీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించాలని సీఎం హిమంత ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ సభ్యుడైన పీసీసీ చీఫ్‌ గౌరవ్‌ జోర్హాట్‌ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో 6.42 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు!     
– గువాహటి

పుదుచ్చేరిలో టీవీకే ఉనికి చాటేనా?
పుదుచ్చేరిలో సీఎం ఎన్‌.రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్‌ఆర్‌సీ, బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి ఈసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. దానికి పోటీగా విపక్ష డీఎంకే, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమితో పాటు సినీ నటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా తొలిసారి బరిలో దిగింది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరుపైనే ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని డీఎంకే, కాంగ్రెస్‌ భావిస్తున్నాయి. వాటిలో విజయ్‌ పార్టీ ఎవరికి నష్టం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ జాతీయవాది సీమాన్‌ సారథ్యంలోని నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.    
– చెన్నై

Advertisement
 
Advertisement
Advertisement