లీమా రోజ్‌ ఆస్తి రూ.1000 కోట్లు | Leema Rose Richest Candidate In Tamil Nadu Assembly | Sakshi
Sakshi News home page

లీమా రోజ్‌ ఆస్తి రూ.1000 కోట్లు

Apr 9 2026 7:55 AM | Updated on Apr 9 2026 12:44 PM

Leema Rose Richest Candidate In Tamil Nadu Assembly

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత ధనికులుగా కొందరు జాబితాలో చేరారు. వీరిలో నంబర్‌ ఒన్‌ కోటీశ్వరరాలుగా లీమా రోజ్‌ ముందంజలో ఉన్నారు. ఆమె ఆస్తి రూ. 1049 కోట్లుగా తేలింది. వివరాలు.. తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కోటీశ్వరుల వివరాలు కొందరివి బయట పడ్డాయి. ఇందులో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో తొలి స్థానాన్ని లాల్గుడిలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి  లీమా రోజ్‌ దక్కించుకున్నారు. ఆమె ఆస్తి రూ. 1,049 కోట్లు. లాటరీ కింగ్ఙ్‌గా పిలవబడే శాంటియాగో మార్టిన్‌ భార్య లీమా రోజ్‌ కావడం గమనార్హం. ఈమె కేవలం 6వ తరగతి వరకే చదువుకున్నట్టు సమాచారం. ఇందులో రూ. 909 కోట్లు స్థిరాస్తులుగా ఉన్నాయి. కుటుంబ ఆస్తి అయితే,  ఆమె భర్త శాంటియాగో మార్టిన్‌ ఆస్తుల విలువ సుమారు రూ. 4,149 కోట్లుగా పేర్కొన్నారు.  

తర్వాతి స్థానంలో విజయ్‌ 
సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం  పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ తన రాజకీయ అరంగేట్రంలోనే భారీ ఆస్తులను ప్రకటించారు. ఆయన  పెరంబూర్‌ , తిరుచ్చి ఈస్ట్‌లో పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తి రూ. 603.20 కోట్లుగా తేలింది.  వివిధ బ్యాంకుల్లో రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ7, టయోటా వెల్‌ఫైర్, లెక్సస్‌ వంటి అత్యాధునిక విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఆతదుపరి టీవీకేకు చెందిన  ఆధవ్‌ అర్జున ఉన్నారు. ఆయన ఆస్థి రూ. 197 కోట్లు. జాబితాలో తొలి స్థానంలో ఉన్న లీమా రోజ్‌ కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ ఆధవ్‌ అర్జున కావడం గమనార్హం. ఆయన విల్లివాక్కంలో పోటీ చేస్తున్నారు.  ఇక, డిప్యూటీ సీఎం ఉదయ నిధికి రూ. 20.64 కోట్లు ఆస్తులు ఉండటం విశేషం. 

ఆయన తండ్రి, సీఎం స్టాలిన్‌ కంటే ఉదయ నిధి ఆస్తులు సుమారు మూడు రెట్లు ఎక్కువ ఉండటం ఆలోచించదగిన విషయమే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆస్తి రూ. 10 కోట్లు కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ ఆస్తి రూ. 34 కోట్లుగా పేర్కొన్నారు.  కొంతమంది అభ్యర్థులు కిలోల కొద్దీ వెండి, కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ప్రధానంగా కన్యాకుమారి, దక్షిణ తమిళనాడు అభ్యర్థులు అనేక మంది వద్ద  తమ వద్ద వందల సవరల  బంగారం ఉన్నట్లు ప్రకటించి ఉండడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement