కృతికా కేసు: ‘పోలీసులు అడిగితే మనం స్నేహితులమని చెప్పు’ | Bengaluru Surgeon Case: If Cops Ask Say We Are Friends | Sakshi
Sakshi News home page

కృతికా కేసు: ‘పోలీసులు అడిగితే మనం స్నేహితులమని చెప్పు’

Apr 9 2026 1:50 PM | Updated on Apr 9 2026 3:50 PM

Bengaluru Surgeon Case: If Cops Ask Say We Are Friends

బెంగళూరు: సంచలనం సృష్టించిన బెంగళూరు డాక్టర్‌ కేసులో ఏడాది తర్వాత.. చాటింగ్ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బెంగళూరుకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి.. కట్టుకున్న భార్యను(చర్మవ్యాధి నిపుణురాలు) కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి తన ప్రియురాలితో కలిసి పథకం పన్నినట్లు తెలుస్తోంది. తన భార్య కృతికా రెడ్డికి ఇంట్లోనే మోతాదుకు మించి అనస్థీషియా డ్రగ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేంద్ర రెడ్డిని.. గతేడాది అక్టోబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన గత ఏడాది ఏప్రిల్ 21న జరిగింది. ఇంట్లో కృతిక అస్వస్థతకు గురైనట్లు నాటకమాడి, మహేంద్ర ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ తదుపరి విచారణలో పోలీసులకు అనుమానాలు కలిగాయి. ఒక డాక్టరుగా తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మహేంద్ర ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

దర్యాప్తు సమయంలో నిందితుడు హర్షిత అనే నర్సుతో సంబంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి. నిఘా సంస్థలకు దొరకకుండా ఉండేందుకు మహేంద్ర వాట్సాప్ వంటి సాధారణ ప్లాట్‌ఫారమ్‌లను వాడకుండా, ఫోన్‌ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా సందేశాలు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నిందితుడి ఫోన్ నుండి డిజిటల్ ఫైళ్లను రికవరీ చేసింది. ఇందులో డిలీట్ చేసిన డేటా, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, ఫోన్ పే చాట్‌లు ఉన్నాయి. వీటిని పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు.

నిందితుడు హర్షితకు పంపిన కొన్ని మెసేజ్‌లు.. అతని నేరం చేయడానికి ముందస్తు ప్లాన్‌ బయటపడింది. "ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకు ఎక్కడా టెక్స్ట్ చేయొద్దు, కాల్ చేయొద్దు. అంతా సర్దుకున్నాక నేనే కాల్ చేస్తాను. ఒకవేళ పోలీసులు నిన్ను పిలిచి మన మధ్య సంబంధం ఏంటని అడిగితే.. మనం కేవలం స్నేహితులమని చెప్పు’’ అంటూ చేసిన చాటింగ్ బయటపడింది. మహేంద్ర, కృతికలకు మే 2024లో వివాహం జరిగింది. వీరిద్దరూ బెంగళూరులోని ఒకే ఆసుపత్రిలో పనిచేసేవారు. సేకరించిన ఆధారాలు బలంగా ఉండటంతో స్థానిక కోర్టు.. మహేంద్ర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement