ఈసీ నోటిఫికేషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
అసెంబ్లీ గడువు ఏడాది లోపే ఉంటే ఉప ఎన్నిక తప్పనిసరి కాదన్న పిటిషనర్లు
పనాజీ: గోవాలోని పోండా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జరగాల్సిన ఉప ఎన్నిక ఒక్క రోజు ముందే రద్దయ్యింది. అయితే, బాంబే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉంది. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గోవా ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ వాల్మీకి మెనెజెస్, జస్టిస్ అమిత్ జమ్సందేకర్ విచారణ చేపట్టారు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషన్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మోండా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవి నాయక్ గత ఏడాది అక్టోబర్‌లో మరణించారు. ఖాళీ అయిన మోండా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నిక ఆగిపోయింది. అయితే, ఓటమి భయంతోనే బీజేపీ ఇక్కడ ఉప ఎన్నికను రద్దు చేయించిందని కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు గిరీశ్ చొడాంకర్ ఆరోపించారు.


