
చెన్నై: తమిళనాట టీవీకే అధినేత విజయ్ చేపట్టిన నిన్నటి(శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ) కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 40 మంది మృత్యువాత పడటం రాజకీయ ప్రకంపనలకు తెరలేపింది. అసలు తొక్కిసలాట ఘటనకు డీఎంకేనే కారణమని, పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్లే ఇదంతా జరిగిందని విజయ్ విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఈ తొక్కిసలాట ఘటనపై విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పచెప్పాలని లేదా సీబీఐకి విచారణకు అప్పగించాలని విజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు విజయ్.
తమిళనాడులో తొక్కిసలాటకు తమ పార్టీని బాధ్యుల్ని చేయడంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. ‘ మీ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి భారీ ప్రాణ నష్టం వాటిల్లితే మీలాగా మేము పారిపోలేదు. ప్రభుత్వం నుంచి ఏం చేయాలో అది చేశాం’ అంటూ విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత జరిగినా ఆ సమయంలో విజయ్ కనిపించకుండా పోయారని సెటైర్లు వేశారు.
రాళ్లు రువ్వారు.. లాఠీచార్జ్ చేశారు
కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఉదయం తన నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తికి జస్టిస్ దండపాణి అంగీకారం తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ.. రేపు(సోమవారం) మధురై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే కేడర్‌పై(విజయ్ మినహా) కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు కూడా. అయితే.. కుట్ర కోణం ఉందన్న నేపథ్యంలో హైకోర్టే సుమోటోగా దర్యాప్తు చేపట్టాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణకు ఆదేశించాలని పిటిషన్‌లో టీవీకే విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. కరెంట్ పోవడం, విజయ్‌పైకి గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసరడం, అదే సమయంలో తొక్కిసటాల జరగడం లాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తమ సభలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది కూడా. అయితే.. టీవీకే ఆరోపణలను ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ వెంకట్‌రామన్ ఖండించారు. అనుమతిచ్చిన దానికంటే జనం అత్యధికంగా వచ్చారని, విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని, ఇప్పుడేమో పోలీసులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 10 వేల మందికే అనుమతి తీసుకున్నారని, కానీ జనం భారీ సంఖ్యలో తరలి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని ఆయన స్పష్టం చేశారు.