దేశ చరిత్రలోనే 2025 ఏడాది ప్రత్యేకంగా గుర్తుండిపోనుంది. మునుపెన్నడూ లేని రీతిలో.. ఈ యేడు వరుసగా తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిలో కొన్ని అత్యంత విషాదకరమైనవిగా నిలిచాయి. అధిక జనసమూహం, భద్రతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. ఆ ఘటనలను పరిశీలిస్తే..
తిరుపతి తొక్కిసలాట..
తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే తొలిసారి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 8వ తొక్కిసలాట జరిగి.. ఆరుగురు భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక దర్శన టోకెన్లు పొందేందుకు భక్తులు కౌంటర్ల వద్ద భారీగా గుమికూడారు. ఆ సమయంలో ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో గేట్‌ను తెరిచారు. దీంతో ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లడంతో తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది.
ఈ ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీటీడీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కుంభమేళాలో మహా విషాదం..
జనవరి 29వ తేదీన మౌనీ అమావాస్య పుణ్యస్నాన దినాన లక్షలాది భక్తులు గంగానదిలో స్నానం చేయడానికి చేరుకున్నారు. అయితే.. చీకట్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో స్పష్టత కొరవడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. అయితే.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో..
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట జరిగి 18 మంది మరణించారు. రైల్వే అనౌన్స్‌మెంట్‌లో తీవ్ర గందరగోళం, అప్పటికే ప్లాట్‌ఫారమ్ 14, 15 వద్ద అధిక జనసంచారం, రైలు రాకతో ప్రయాణికులు ఒక్కసారిగా తోసుకుంటూ ప్లాట్‌ఫారమ్‌లపైకి చేరడంతో తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపమే ఈ ఘటనకు కారణమని తర్వాత తేలింది.

బెంగళూరు స్టేడియం బయట..
జూన్ 4వ తేదీన బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీని తొలిసారిగా నెగ్గడంతో.. విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో.. చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. అంచనాలకు మించి అభిమానులు రావడం.. వాళ్లను అదుపు చేయలేకపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ ఘటనపై రాజకీయంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కరూర్ ఘటన..
సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. నిర్వహణ లోపమని, విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న జనం గందరగోళానికి గురై తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ఇది రాజకీయ కుట్ర అంటూ టీవీకే ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు జోక్యంతో ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు నడుస్తోంది.

కాశీబుగ్గ ఆలయం వద్ద..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో నవంబర్ 1వ తేదీన(ఇవాళ) ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు(మృతుల సంఖ్య పెరగొచ్చని చెబుతున్నారు). ఏకాదశి కావడంతో భక్తులు భారీగా రావడంతో ఇది చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా పేరున్న ఆలయంలో.. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.


