 
													తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాటపై తొలిసారి నటుడు అజిత్ స్పందించారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. ఈ అంశంలో విజయ్తో పాటు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాలకు చెందిన వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్ సూచించారు.
అజిత్ తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరూర్ ఘటన గురించి ఇలా మాట్లాడారు. ' కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పలాన వ్యక్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేను ఎవరినీ వేలెత్తి చూపించడం లేదు.
ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో అన్నింటినీ మార్చివేసింది. ఇది ఆ ఒక్క వ్యక్తి (విజయ్) తప్పు కాదు. కానీ, అందులో మన తప్పు కూడా ఉంది. దానికి మనమందరం బాధ్యులమే. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చాలామంది వెళ్తారు. కానీ, వారందరూ కూడా చాలా సురక్షితంగానే తిరిగొస్తారు. అయితే, సినీతారలకు సంబంధించిన సభల్లోనే కరూర్ లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీడియా వీటిపై మరింత అవగాహన కలిగిస్తే మేలు జరుగుతుంది. సినిమా థియేటర్కు వెళ్లినా అదే పరిస్థితి ఉంది. కేవలం ఇండస్ట్రీ చుట్టే ఇలా జరగడంతో పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది.' అని అజిత్ పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
