
చెన్నై: తమిళగ వెట్రి కగళం (టీవీకే) అధినేత విజయ్‌కు భారీ షాక్ తగిలింది. కరూర్ (TVK chief Vijay at Karur rally) విషాద ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు విజయ్ నిర్వహించే ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదివారం (సెప్టెంబర్28) సాయంత్రం 4.30 గంటలకు మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టనుందని సమాచారం.
తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన కరూర్ తొక్కిసలాట. శనివారం సాయంత్రం విజయ్ నిర్వహించిన సభకు హాజరై ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కొద్దిసేపటి క్రితం 40మందికి చేరింది. 100మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 48మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్యను కరూర్ జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, ఈ దుర్ఘటనలో విజయ్‌పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కరూర్ విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట కేవలం ప్రమాదం కాదని, సభ నిర్వాహాణ లోపం, సభకు హాజరైన ప్రజల ప్రాణాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు టీవీకే అధినేత ఎలాంటి రాజకీయ సభలు నిర్వహించకుండా నిషేధం విధించాలని కోరుతూ కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
సామాజిక కార్యకర్త సెంథిల్ కన్నన్ సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంథిల్ కన్నన్ తన పిటిషన్‌లో ‘ప్రజా భద్రత ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) అనేది అసెంబ్లీ హక్కు (సమావేశాలు నిర్వహించే హక్కు) కంటే ముఖ్యమైనది. అంటే, ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటం అత్యవసరం. అందువల్ల, టీవీకే పార్టీ భవిష్యత్‌లో నిర్వహించే ర్యాలీలకు అనుమతి ఇవ్వకుండా నిరోధించాలి’ అని కోర్టును కోరారు.
విజయ్ పర్యటన రద్దు
మరోవైపు వచ్చేవారం తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ తన రాజకీయ పర్యటనను రద్దు చేసుకున్నారు. కరూర్ తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు. పరామర్శ కోసం విజయ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు.