
సాక్షి,చెన్నై: ‘నన్ను టార్గెట్ చేయండి.. ప్రజల్ని కాదు’ అంటూ కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తొలిసారి స్పందించారు. ఈ మేరకు విజయ్ మంగళవారం (సెప్టెంబర్30న) ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో ‘ఈ ఘటన నన్ను కలచివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. త్వరలో బాధితుల్ని కలుస్తా. నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుంటాను’ అని వ్యాఖ్యానించారు.
— TVK Vijay (@TVKVijayHQ) September 30, 2025
శనివారం రాత్రి కరూర్‌లో విజయ్ మీట్ ది పీపుల్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు,టీవీకే కార్యకర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది.
షెడ్యూల్ ప్రకారం .. విజయ్ కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వామిపురం సభాస్థలికి చేరుకున్నారు.
దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్‌ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు.