‘సుప్రీం’ పిటిషన్‌లో ఆ రెండు ప్రాజెక్టులను ఎందుకు చేర్చలేదు? 

Uttam Kumar Reddy Questions Telangana Government Over Projects In Telangana - Sakshi

కేసీఆర్‌ మౌనం వెనుక పెద్ద కుట్ర.. సుప్రీం కేసులో ఇంప్లీడ్‌ అవుతాం  

ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభమైతే కేసీఆర్‌ రాజీనామా చేయాలి: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌  

దక్షిణ తెలంగాణ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలి: సీఎల్పీ నేత భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు అంశంలో తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మౌనం వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జూమ్‌ యాప్‌ ద్వారా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, కృష్ణా జలాల పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రామ్మోహన్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై కేం ద్రం ఏర్పాటు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కు హాజరుకాకుండా కేబినెట్‌ భేటీ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇది తెలంగాణకు ద్రోహం చేసే కుట్ర అని వ్యాఖ్యానించారు.  

19 వరకు ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తి.. 
ఈ నెల 19వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తుందని, పనులు ప్రారంభించాక అపెక్స్‌ కమిటీ మీటింగ్‌ పెడితే ఏం లాభమని ఉత్తమ్‌ ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో వేసిన రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లో ఏపీ ప్రాజెక్టులు, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఆపేయాలనే అంశం లేదని విమర్శించారు. ఆ పిటిషన్‌లో కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పేరును ఎందుకు చేర్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పిటిషన్‌ చాలా లోపభూయిష్టంగా ఉందన్నారు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా రాకుండా పోతే కేసీఆర్‌ బాధ్యత వహించాలని, పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమైతే కేసీఆర్‌ విఫలమైనట్టేనని, అందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తాము కూడా ఇంప్లీడ్‌ అవుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాలపై ఉద్యమిస్తామని, పోతిరెడ్డిపాడు అంశంపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని ఉత్తమ్‌ చెప్పారు. 

శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులకు నీళ్లు రావు: భట్టి  
పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్‌ వల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా పోతాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రజల తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టుల టెండర్లు పూర్తయ్యే వరకు ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు అంశంపై దక్షిణ తెలంగాణ ప్రజలు పోరుకు సిద్ధం కావాలని భట్టి కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top