బండిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గరంగరం

TRS MLAs counter attack on BJP - Sakshi

బండి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, కిశోర్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేవలం సీఎం కేసీఆర్‌ను తిట్టడం కోసమే పెట్టినట్లు ఉందని హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి  సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం కరోనాను కనిపెట్టడంలో విఫలమవగా ఆ సమయంలో కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత ధీటుగా ఎదుర్కొందో దేశమంతా చూసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలను కేంద్రమంత్రులందరూ పొగిడారని చెప్పారు. గుజరాత్ తరువాత తెలంగాణ మాత్రమే జీఎస్టీ అత్యధికంగా కడుతున్న రాష్ట్రమని ఎమ్మెల్యే తెలిపారు. జనాల మైండ్‌తో గేమ్ ఆడుతూ ఎన్నికల్లో గెలుస్తున్నారని విమర్శించారు. బీజేపీకి రామ మందిరం కట్టడమే ఇష్టం లేదని.. సుప్రీంకోర్టు చెప్పేవరకు పోరాటం చేసిన నేత ఒక్కరూ బీజేపీలో లేరని పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ దేవలమెంట్ పెట్టి దేశంలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తెలంగాణలో 7లక్షల 60 వేల ఉద్యోగాలు ఐటీ ఆధారితతో యువతకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా లోగోను రూ.10 కోట్లు పెట్టి బయట కొన్నా ఉపయోగం లేదని చెప్పారు. కొన్ని పిచ్చి కుక్కలను రాష్ట్రం మీదకు వదిలారు!.. అని తీవ్రస్థాయిలో బీజేపీ నేతలపై సైదిరెడ్డి విరుచుకుపడ్డారు.

మాఫియాను పోషించేది బీజేపీనే
మరో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దేశీయ దొంగలు ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సత్యహరిశ్చంద్రుడు బతికి ఉంటే వీరి మాటలు విని ఆత్మహత్య చేసుకునే వారని తెలిపారు. దేశంలో మాఫియాను పెంచి పోషించేది బీజేపీ అని, హత్యలు అత్యాచారాలు చేసిన 25 మంది మంత్రివర్గాల్లో ఉన్నారని ఎమ్మెల్యే కిశోర్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా కేసులు ఉన్న నేతలు 176 మంది పాలకవర్గంలో కొనసాగుతున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేసుల వల్ల గతంలో గుజరాత్ నుంచి వెలివేశారని గుర్తుచేశారు. దేశానికి మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లధనం పేరుతో ఎంతమందిని అరెస్ట్ చేశారని, పేదలకు ఎంతధనం పంచారో చెప్పాలి? అని ప్రశ్నించారు. మాఫియా అనేది ఎవరో దేశ.. రాష్ట్ర ప్రజలకు తెలుసని తెలిపారు. దేశం బయట ఉన్న డబ్బులు దేశానికి రప్పించకుండా.. దేశంలో ఉన్న డబ్బులు బయటకు తరలిస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్ కాలం దగ్గర పడిందని హెచ్చరించారు. కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను అన్నట్లేనని ఎమ్మెల్యే కిశోర్‌ పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top