సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ ఫలితాన్ని పట్టించుకోబోమని అన్నారాయన. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
బీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు. బీఆర్‌ఎస్ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయి. చివరి మూడు రోజులు ఏం జరిగిందో అందరికీ తెలుసు. బైపోల్ మాకు కొత్త బలాన్ని ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్సే. జూబ్లీహిల్స్ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలకు తెలుసు. మాగంటి సునీత చివరి దాకా పోరాటం చేశారు.
ఈ ఎన్నిక కోసం మేం కుల, మత రాజకీయాలు చేయలేదు. బీఆర్‌ఎస్ ఒత్తిడి వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. బీఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ అన్నివిధాలా అభివృద్ధి చెందింది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. జూబ్లీహిల్స్ ఫలితాలపై మాకు నిరాశ లేదు. బీఆర్‌ఎస్‌కు పోరాటాలు కొత్త కాదు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా మా పని మేం చేసుకుంటూపోతాం. మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యేదాకా పోరాటం చేస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.



