జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ తోక కత్తిరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ నాశనం చేశారు.. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైరయ్యారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అంటున్న కాంగ్రెస్‌కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్న కేటీఆర్.. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
అన్ని సర్వేలు హాస్తం వైపే: ఉత్తమ్
జూబ్లిహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు హస్తం వైపే వెలువడడమే ఇందుకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుండి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్‌లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కటంటే ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 89 లక్షల నుండి కోటి 15 లక్షలకు తెల్ల రేషన్ కార్డులు పెంచామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసనసభ్యులు ఇదూలపల్లి శంకరయ్య,కాంగ్రెస్ పార్టీ నేత అజారుద్దీన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు: పొన్నం
రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల కుట్రలను ఛేదించడానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారని మంత్రి పొన్నం సూటిగా ప్రశ్నించారు.
జూబీహిల్స్‌లో పొంగులేటి పాదయాత్ర
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జూబీహిల్స్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీజేఆర్ తల్లితండ్రుల పేరు కలిగిన శివమ్మ, పాపిరెడ్డి హిల్స్‌లో మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గజపూల మాల, నృత్యాలతో అక్కడి ప్రజలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వందమంది మైనార్టీ యువకులకు, మరో వంద మంది మహిళలకు కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకతాను ముక్కలే, గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందని అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తధ్యమని అందువల్లే బీఆర్ఎస్ మాజీ మంత్రులు అక్కసుతో మాట్లాడుతున్నారని, ఆ మాజీ మంత్రులు భాష సంస్కరించుకోవాలని పొంగులేటి హితవు పలికారు.
సీఎం రోడ్ షో.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఎర్రగడ్డ డివిజన్ లోని విజయ థియేటర్ నుంచి ప్రారంభమయ్యే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విజేత థియేటర్ నుంచి మోతీనగర్ ఎక్స్ రోడ్, డాన్ బోస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ సైడ్ వరకు రోడ్ షో సాగుతుంది. జనప్రియ బ్యాక్ సైడ్ (బి శంకర్‌లాల్ నగర్)లో బహిరంగ సభ నిర్వహిస్తారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, డా. ఆర్. భూపతి రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, డా. రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎనగల వెంకట్రామ్ రెడ్డి తదితరులు రోడ్ షోలో పాల్గొంటారు.
రెండో రోజు సీఎం ప్రచారం ఇలా..
⇒ రెండో రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
⇒ ఇవాళ బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారంలో పాల్గొననున్న సీఎం
⇒ సాయంత్రం 7 గంటలకు బోరబండ డివిజన్ లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
⇒ అనంతరం ఎర్రగడ్డ డివిజన్‌లోని సుల్తాన్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి జనప్రియ వరకు రోడ్ షో
⇒ జనప్రియ వద్ద కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్ రోడ్ షో
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం కేటీఆర్ (KTR) రోడ్ షో నిర్వహించనున్నారు. రెహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని ప్రతిభ నగర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది. శ్రీరామ్ నగర్ హోటల్ SD వద్ద ప్రసంగించి, రెహమత్‌నగర్ వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వరకు కేటీఆర్ రోడ్ షో కొనసాగించనున్నారు.


