ముగ్గురు మినహా మంత్రులంతా జీరోలే

Telangana People Looking For Change Says Kishan Reddy - Sakshi

ఆమనగల్లు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మంగళ వారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ నాయకత్వంలో నియంతృత్వ, అవినీతి కుటుంబ పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందని, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిని తీసుకొస్తామని, రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా బీజేపీ పాలన సాగిస్తుందని చెప్పారు. తమ ఆత్మగౌరవాన్ని కల్వకుంట్ల కుటుంబం వద్ద తాకట్టు పెట్టినట్లయిందని ప్రజలు వాపోతున్నారన్నారు. కీలకమైన 15 శాఖలు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ వద్ద ఉన్నాయని, మిగతా మంత్రుల వద్ద మామూలు శాఖలు ఉన్నాయని, ఆ ముగ్గురు మినహా కేబినెట్‌లో మంత్రులంతా జీరోలే అని ఆయన విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

శ్రీశైలం జాతీయ రహదారికి రూ.1720 కోట్లు 
హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారిలో తుక్కుగూడ నుంచి డిండి వరకు 85 కిలోమీటర్ల రోడ్డును నాలుగు లేన్‌లుగా విస్తరించడానికి రూ.1720 కోట్లు మంజూరైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 788 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.16571 కోట్లు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్‌ వరకు 79 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.886 కోట్లు మంజూరైనట్లు కిషన్‌రెడ్డి వివరించారు.
చదవండి: హరీశ్‌రావు.. దమ్ముంటే దుబ్బాకలో పోటీచెయ్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top