
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థులు ఎవరనేదానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్‌కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని మంగళవారం అన్నారు.
కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ, జూబ్లీహిల్స్ టికెట్ స్థానికంగా పని చేసిన వాళ్లకే ఉంటుంది. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతేకాని బయటి నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగబోదు అని అన్నారాయన.

జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆరు నెలల లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, 2025 డిసెంబర్‌లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్‌లో విడుదలై.. అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంతదాకా అభ్యర్థులను ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సతీమణి సునీత పేరు గతకొంతకాలంగా ప్రచారంలో వినిపిస్తోంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే.. పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అజహారుద్దీన్ పోటీ చేసి ఓడారు. అయితే ఈసారి తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారాయన. హస్తం పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్నందున స్వతంత్రంగా పోటీ చేయడమా? లేదంటే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందా? అనే దానిపై ఎంఐఎం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.