‘దిశ’తో మహిళల్లో ఆత్మస్థైర్యం 

Taneti Vanitha Comments On Nara Lokesh - Sakshi

బిల్లు ప్రతులను తగలబెట్టడం లోకేశ్‌ అజ్ఞానానికి నిదర్శనం 

చట్టసభలు ఆమోదించిన బిల్లును అపహాస్యం చేస్తారా? 

మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మండిపాటు 

సాక్షి, అమరావతి: దిశ బిల్లు, దిశ యాప్‌ వల్ల మహిళల్లో చైతన్యం పెరిగిందని.. మహిళల భద్రత, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలను చూసి ఓర్వలేక టీడీపీ నేత నారా లోకేశ్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. మహిళలను అవమాన పరిచే రీతిలో పార్టీ మహిళా నేతల సమక్షంలో ‘దిశ’ప్రతులను తగలబెట్టడం లోకేశ్‌ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. బుధవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చడంలో జాప్యం జరుగుతున్నా, మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిందన్నారు.

దిశ యాప్‌ ద్వారా మహిళలు, యువతులపై దాడులను ముందుగానే అడ్డుకుని రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ ‘దిశ’ను అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నాయన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును శాసనసభ, శాసన మండలి ఆమోదంతోనే కేంద్ర ప్రభుత్వానికి పంపామని మంత్రి స్పష్టం చేశారు. శాసన మండలి సభ్యుడిగా బిల్లు గురించి లోకేశ్‌ అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రస్తుతం బిల్లు చట్టంగా మారే క్రమంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై లోకేష్‌ కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని ఆమె ప్రశ్నించారు.   

పరిహారంపై అవహేళన దారుణం  
గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యం, ఇతర సహాయాల నిమిత్తం బాధిత మహిళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తోందని మంత్రి వనిత చెప్పారు. దీనిపై లోకేశ్‌ హేళనగా మాట్లాడటం దారుణం అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బాధితురాలికీ న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వ చర్యల వల్లే బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top