
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిది. భారత సైన్యం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీరు (రాహుల్)ఎలా చెబుతున్నారని కోర్టు ప్రశ్నించింది.
భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరువు నష్టం దావా కింద క్రిమినల్ కేసు వేశారు. అయితే ఈ ఫిర్యాదులో విచారణ పై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏసీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు రాహుల్ వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని ప్రశ్నించింది.
ప్రతిపక్షనేత హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించింది. నిజమైన భారతీయులు ఇలాంటి వ్యాఖ్యలు చేయరని మండిపడింది.
కాగా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా..2,000 కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020 జూన్‌లో లబ్దఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ అనంతరం, మోదీ ప్రభు త్వం చైనాకు లొంగిపోయిందని, 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని ఆరోపించారు.

అయితే రాహుల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, వాదనలు వినిపించారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులోనే మాట్లాడాలని.. సోషల్ మీడియాలో కాదని మండిపడింది. ఈ కేసులో విచారణను నిలిపివేసినప్పటికీ.. రాహుల్‌కు మాత్రం నోటీసులు జారీచేసింది.