బిహార్‌లో జంగిల్‌రాజ్ నేతలకు ఘోర పరాభవం తప్పదు
ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బీజేపీ మహిళా కార్యకర్తలతో సంభాషణ
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఈసారి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. గత 20 ఏళ్లలో ఏన్నడూ లేనట్టి అద్భుతమైన విజయం ఈ ఎన్నికల్లో సాధించబోతున్నామని చెప్పారు. జంగిల్‌రాజ్ మనుషులకు ఘోరమైన పరాభవం తప్పదని పునరుద్ఘాటించారు. ఇద్దరు యువరాజులు రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల మద్దతు పొందడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన యువరాజు ఛఠ్ పూజలను అవమానించాడని మండిపడ్డారు.
ప్రధాని మోదీ మంగళవారం బిహార్ బీజేపీ మహిళా కార్యకర్తలతో నమో యాప్ ద్వారా వర్చువ ల్‌గా సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం మహిళా కార్యకర్తలు కష్టపడి పని చేసు న్నారని ప్రశంసించారు. బిహార్‌లో ఇటీవల పలు బహిరంగ సభల్లో పాల్గొన్నా నని, మహి ళలు అత్యధికంగా హాజరయ్యారని చెప్పారు. ఒక సభకు మించి మరో సభ జరిగిందన్నారు. ఎన్డీయేకు మహిళల ఆదరణ మరింత పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఎన్డీయే విజయం పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.
ఎవరూ ఊహించలేని భారీ విజయం సాధించబోతున్నామని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలు, దళితులు, మహా దళితులు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. వారి జీవనం మరింత సులభతరంగా మారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుపరిపాలన, చట్టబద్ధమైన పాలన అమల్లో ఉన్నప్పుడే మహిళలు అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయని వివరించారు. ఎన్డీయే పాలనలో ఆడబిడ్డల ప్రగతికి పెద్దపీట వేశామన్నారు. బిహార్ మహిళలు నేడు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసల వర్షం కురిపించారు.


