తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రక్రియ
డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది జాబితాలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే మంగళవారం ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌ఓ)లు విధులు నిర్వర్తిస్తున్నారని, ఓటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారని ఎన్నికల సంఘం తెలియజేసింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాలు విడుదల చేశారు. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పుల అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారు.
మొత్తం 321 జిల్లాల్లో 1,843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎస్‌ఐఆర్‌కు ఈసీ శ్రీకారం చుట్టింది. దాదాపు 51 కోట్ల మంది ఓటర్ల అర్హతను నిగ్గుతేల్చబోతున్నారు. ఈ క్రతువులో 5.3 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు(బీఎల్‌వో), 10,448 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులు, 321 మంది జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొంటున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 7.64 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏ) బీఎల్‌వోలకు సహకరిస్తారు. తొలి దశలో భాగంగా బిహార్‌లో ఎస్‌ఐఆర్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే.
రెండో దశలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, గోవా, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎస్‌ఐఆర్‌ను ప్రారంభించినట్లు ఈసీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. అయితే, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాంలో ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అస్సాంలో ప్రజల పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అక్కడ ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌ను ప్రత్యేకంగా ప్రకటించబోతున్నారు.
కేరళలో నేడు అఖిలపక్ష భేటీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు. ఓట్లు మాయం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చర్చించడానికి బుధవారం అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. కేరళలో బీజేపీ మినహా అన్ని పార్టీలూ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు రాజ్యాంగబద్ధత లేదని తమిళనాడులో అధికార డీఎంకే తేల్చిచెప్పింది. ఎస్‌ఐఆర్ విషయంలో అక్టోబర్ 27న ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు తమిళనాడులో బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే ఎస్‌ఐఆర్‌ను స్వాగతించింది. ఉత్తరప్రదేశ్‌లో ‘శుద్ధ్ నిర్వాచక్ నామావళి–మజ్‌బూత్ లోక్‌తంత్ర’ థీమ్‌తో ఎస్‌ఐఆర్ ఆరంభమైంది.
పశ్చిమ బెంగాల్‌లో రగడ
ఎస్‌ఐఆర్ పట్ల పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ పేరిట నిశ్శబ్దంగా ఓట్ల రిగ్గింగ్ జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఓటర్ల జాబితాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమిటని మండిపడ్డారు. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి తొత్తుగా మారిందని విమర్శించారు. కోల్‌కతాలో జరిగిన ఎస్‌ఐఆర్ వ్యతిరేక ర్యాలీలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఆపాలంటూ నినదించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఎస్‌ఐఆర్ ప్రారంభించారని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఒక్క ఓటరుకు అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదన్నారు.


