- ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే శక్తులు ఏంటి?
కొన్నేళ్ల క్రితం వరకు తమిళనాడు పేరు వినగానే మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత గుర్తుకువచ్చేవారు. ఇక ఎన్నికల సమయంలో వీరిని చూసే ప్రజలు ఓట్లు వేసేవారు. ఇప్పుడు వారిద్దరూ లేరు. ఈ ఇద్దరు ఉద్ధండులు లేకుండానే 2021 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడులో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు సమీపించే దశ నుంచి ఫలితాలు వెలువడే వరకూ రాజకీయ పార్టీల నేతలు చేసే హడావిడి అంతాఇంతా కాదు. అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఎన్నికల విషయంలో అనేక అంశాలు విజయం, ఓటమిలో పాత్ర పోషిస్తాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. 1952 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో పలు అంశాలు గెలుపు, ఓటములను నిర్ణయిచాయి.
1952 నుంచి 2021 వరకు
తమిళనాడులో 1952 నుంచి 2021 వరకు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తే సాధారణంగా విజయం వేటిపై ఆధారపడి వరిస్తుందో తెలుసుకోవచ్చు. మామూలుగా ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, ఓటర్ల స్పందన వంటి అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
తమిళనాడులో ఏ ఎన్నికల వేళ ఏం జరిగింది?
1952–1962
1952 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆ పార్టీ పాత్ర పోషించడంతో తమిళనాడు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది.
1957, 1962 ఎన్నికల్లో డీఎంకే ముఖ్య ప్రత్యర్థిగా ఎదిగి రాజకీయంగా కాంగ్రెస్‌కు పోటీగా మారింది.
1967 కాంగ్రెస్‌పై వ్యతిరేక భావన, బియ్యం ధరలు పెరగడం వంటి ఆర్థిక ఇబ్బందులు డీఎంకేను ఎన్నికల్లో గెలిచేలా చేశాయి.
1971లోనూ డీఎంకే గెలిచింది.
1977 డీఎంకేలో విభజన, ఎంజీఆర్ ప్రజాకర్షణ వల్ల అన్నాడీఎంకే భారీ విజయం సాధించింది.
1980–1990 దశకం
ఎంజీఆర్ ప్రజాదరణ, కూటమి వ్యూహాలు ఫలితాల్లో కీలక భూమిక పోషించాయి. 1980, 1984లో అన్నాడీఎంకే విజయం సాధించింది.
1989లో మాత్రం డీఎంకేను విజయం వరించింది.
1991లో రాజీవ్ గాంధీ హత్య ఓటర్ల భావోద్వేగాలను ప్రభావితం చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే విజయం సాధించింది.
1996లో అన్నాడీఎంకేపై భారీగా ప్రజా వ్యతిరేకత, రాజకీయ కూటములు డీఎంకేకు స్పష్టమైన విజయం ఇచ్చాయి.
2001–2011 మధ్య
కూటమి రీతులు, అవినీతి ఆరోపణలు, నాయకత్వ సంక్షోభాలు ఎన్నికల తీర్పులను ప్రభావితం చేశాయి.
2016–2021
2016 ఎన్నికల్లో చిన్న పార్టీల ఓట్ల షేర్, తేడా తక్కువగా ఉండటం ఫలితంపై ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచింది.
2021లో జయలలిత, కరుణానిధి మరణం తర్వాత రాజకీయ పరిస్థితి మారి డీఎంకే కూటమి భారీ విజయం సాధించింది.
ఎన్నికల ఫలితాలను నిర్ణయించిన ప్రధాన అంశాలు
1. ప్రజా వ్యతిరేకత: అధికార పక్షంపై అసంతృప్తి ఫలితాలను మార్చేస్తుంది.
2. నాయకుల ప్రజాకర్షణ: ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికలను ప్రభావితం చేస్తారు.
3. కూటమి బలం: ఎవరు ఎవరితో కలుస్తారన్నది తుది ఫలితంపై ప్రభావం చూపుతుంది.
4. చిన్న పార్టీలు: చిన్న పార్టీల ఓట్లు ప్రధాన పార్టీలకు నష్టం లేదా లాభం కలిగిస్తాయి.
5. చారిత్రక సంఘటనలు: ఆర్థిక పరిస్థితులు, పెద్ద సంఘటనలు ఓటర్ల అభిప్రాయాన్ని మార్చుతాయి.


