సాక్షి, చెన్నై: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న లక్ష్య జన నాయగ కట్చి పార్టీ అధ్యక్షుడు జోస్ చార్లెస్ మార్టిన్ తన ఆస్తి రూ.537 కోట్లుగా ప్రకటించారు. కామరాజర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల సంఘానికి అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. జోస్ చార్లెస్ మార్టిన్ వద్ద రూ.25.67 కోట్ల విలువైన 17.5 కిలోల బంగారం, రూ.44 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి.
ఆయన పేరిట రూ.328 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రూ.1.29 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయి. రూ.1.77 కోట్ల విలువైన వాచ్, రూ.38.53 కోట్ల విలువైన ముత్యాల హారాలు కూడా ఉన్నాయి. లండన్‌లో రూ. 5.64 కోట్లు, దుబాయ్‌లో రూ.1.50 కోట్లు విలువైన నివాసాలున్నాయని పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్, గోవా, నాగాలాండ్, పంజాబ్‌లో లాటరీ అమ్మకాలలో 4.53 శాతం వాటా, బెంగాల్‌లో 3 లాటరీ కేసులు, ఎర్నాకుళంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో 3 కేసులున్నాయని తన అఫిడవిట్‌లో వివరించారు.
షేర్లలో రూ.14.28 కోట్లు, వివిధ బ్యాంకుల్లో రూ.200 కోట్లు డిపాజిట్లు ఉన్నట్టు వివరించారు. అలాగే, రూ. 210 కోట్లు అప్పులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం తన ఆస్తి రూ.537 కోట్లుగా లెక్క చూపించారు. చార్లెస్ లాటరీ అధినేత మార్టిన్ కుమారుడు కావడం గమనార్హం.


