అది విశ్వాసఘాతుకమే!

Sonia Gandhi on Centre not clearing GST dues - Sakshi

కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై సోనియా మండిపాటు

విపక్ష సీఎంలతో వర్చువల్‌ భేటీ నిర్వహించిన కాంగ్రెస్‌ చీఫ్‌

పాల్గొన్న ఉద్ధవ్‌ ఠాక్రే, మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు

న్యూఢిల్లీ: రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడానికి కేంద్రం నిరాకరించడం విశ్వాసఘాతుకమని కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల ముఖ్యమంత్రుల భేటీని ఉద్దేశించి సోనియా బుధవారం ప్రసంగించారు. నేడు జీఎస్టీ మండలి భేటీ జరగనుండడం, సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ వర్చువల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు అని, దాన్ని నిరాకరించడం దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడంతో సమానమేనని ఈ సందర్భంగా సోనియా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో చేసిన చట్టాల ఆధారంగానే జీఎస్టీ పరిహారాన్ని నిర్ణయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో జీఎస్టీ ఏర్పాటయిందని, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పన్నుల విషయంలో తమ రాజ్యాంగబద్ధ హక్కులను కోల్పోయేందుకు రాష్ట్రాలు అంగీకరించినందువల్లనే జీఎస్టీ అమలు సాధ్యమైందని ఆమె వివరించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

పరిహార బకాయిలు పెరిగి రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కేంద్రం మాత్రం రాష్ట్రాలతో పంచుకోవడానికి వీల్లేని ఏకపక్ష సెస్‌లతో లాభాలు దండుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో ఒకే విధంగా ఆలోచించే పక్షాలను సమన్వయపరిచే ఉద్దేశంతో ఈ భేటీ ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని జరగాలన్నారు. ఇటీవల కేబినెట్‌ ఆమోదించిన నూతన విద్యా విధానం  లోపభూయిష్టంగా ఉందని  విమర్శించారు. శాస్త్రీయ, ప్రగతిశీల, లౌకిక విలువలకు వ్యతిరేకంగా ఆ విధానముందన్నారు.

వ్యవసాయ మార్కెటింగ్‌పై తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ల వల్ల కనీస మద్దతు ధర విధానం, ప్రజా పంపిణీ వ్యవస్థ  దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.  దశాబ్దాలుగా సృష్టించుకున్న ప్రభుత్వ రంగ సంపదలను ప్రభుత్వం అమ్మకానికి పెడ్తోందని విమర్శించారు.  ముఖ్యమైన 6 విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించారని, రైల్వేలోనూ ప్రైవేటుకు తలుపులు తీశా రని విమర్శించారు. దేశ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రాల సీఎంలతో మాట్లాడాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని సోనియా కోరారు. మమతతో పాటు ఉద్ధవ్‌ ఠాక్రే (మహారాష్ట్ర), హేమంత్‌ సోరెన్‌ (జార్ఖండ్‌), అమరీందర్‌ సింగ్‌ (పంజాబ్‌), భూపేశ్‌ భఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌), అశోక్‌ గహ్లోత్‌ (రాజస్తాన్‌) సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్రపతిని కలుద్దాం
రాష్ట్రాల సమస్యలపై, నిధుల లేమిపై రాష్ట్రపతిని కానీ, ప్రధానిని కానీ సీఎంలంతా ఒక ప్రతినిధి బృందంగా కలుద్దామని రాజస్తాన్‌ సీఎం గహ్లోత్‌ ప్రతిపాదించారు. ఈ బృందానికి నేతృత్వం వహించాలని సోనియాను కోరారు. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి సాయం అందించడం లేదన్నారు.

భయమా.. పోరాటమా?
కేంద్రానికి భయపడడమా? రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడమా? తేల్చుకోవాలని ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. జీఎస్టీ మంచిదా? గత పన్ను వ్యవస్థ మంచిదా? అని ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.   పరిస్థితి సీరియస్‌గా ఉందని, ఈ సమయంలో విపక్షాలు కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ చెప్పారు. విపక్షాలపై కక్ష సాధింపునకు దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని భఘేల్‌ ఆరోపించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top